చంద్రబాబుకు.. రేవంత్ కు డీల్ కుదిరిందా?

Update: 2017-10-31 01:30 GMT

రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ను చంద్రబాబు చాలా జాగ్రత్తగా డీల్ చేసినట్లు కన్పిస్తోంది. గతంలో ఎవరి విషయంలోనూ తీసుకోనన్ని జాగ్రత్తలు రేవంత్ రెడ్డి విషయంలో తీసుకున్నారు. అందుకే రేవంత్ రెడ్డి చంద్రబాబుపైన గాని, తెలుగుదేశం పార్టీని గాని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. అంతేకాదు పసుపు పార్టీ అంటే ఇప్పటికీ తనకు ఇష్టమేనని చెప్పుకొస్తున్నారు. ఆత్మీయులతో మాట..ముచ్చట కార్యక్రమంలో కూడా చంద్రబాబును రేవంత్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. రాజీనామా లేఖలోనూ చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన రేవంత్.. ఆత్మీయులతో సమావేశంలోనూ చంద్రబాబును విస్మరించలేదు. ప్రధాని అయ్యే అవకాశమొచ్చినా చంద్రబాబు కాదనుకున్నారని వీర లెవల్లో తన భక్తిని ప్రదర్శించారు రేవంత్. చంద్రబాబు వంటి నేతలను వీడిరావడం బాధాకరంగా ఉందన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతూ చంద్రబాబును పొగిడేయడం మాత్రం రేవంత్ ఆపలేదు.

బాబును పొగడ్తలతో.....

దీనికి ప్రధాన కారణం... చంద్రబాబు, రేవంత్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందమేనన్నది టాక్. రేవంత్ వాస్తవానికి పార్టీ నుంచి డిసెంబర్ నెలలో బయటపడదామనుకున్నారు. అధినేతతో మాట్లాడి ఆయన ఆశీస్సులు పొందిన తర్వాతనే పార్టీని వీడాలనుకున్నారు. కాని కాంగ్రెస్ నేతలు మీడియాకు ఉప్పందించడంతో రచ్చ రచ్చ అయింది. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు వాయిస్ పెంచేశారు. విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు టీటీడీపీ నేతలతో సమావేశమైనా రేవంత్ ను ఒక్కమాట అనలేదు. పైగా విజయవాడ రావాలని కోరారు. బెజవాడకు వెళ్లిన రేవంత్ తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. రేవంత్ ను రాజీనామా ఇచ్చి వెళ్లాలని చంద్రబాబే కోరినట్లు సమాచారం. అయితే పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా ఎటువంటి కామెంట్లు చేయొద్దని కూడా చంద్రబాబు రేవంత్ ను కోరారు. అలాగే రేవంత్ కూడా తనపై కూడా పార్టీ నుంచి ఎలాంటి విమర్శలు రాకుండా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. తాను పార్టీని వీడుతున్నా మనస్సంతా ఇక్కడే ఉంటుందని ఈ సందర్భంగా రేవంత్ చంద్రబాబుతో అన్నారట. విధిలేని పరిస్థితుల్లోనే పార్టీని వీడుతున్నానని, దయచేసి వేరేగా అర్థం చేసుకోవద్దని కోరారట. అందుకు చంద్రబాబు కూడా ‘నువ్వు ఎదగడం కంటే నాకు కావాల్సింది ఏముంది’ అని ముక్తాయించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్లనే పార్టీపై ఎలాంటి విమర్ళలు రేవంత్ దిగలేదు. గతంలో ఏపీ మంత్రులపై చేసిన ఆరోపణలను కూడా ప్రస్తావించడం మానేశారు. పూర్తిగా చంద్రబాబుకు, రేవంత్ కు మధ్య కుదిరిన ఒప్పందం మేరకే రేవంత్ ఇలా వ్యవహరిస్తున్నారన్న టాక్ బలంగా విన్పిస్తోంది.

Similar News