ఓటుకు నోటు కేసు అంతా సమసిపోయినట్లుగా చాన్నాళ్లపాటూ స్తబ్దుగా ఉండిపోయింది. అయితే కొన్ని రోజులుగా.. ఓటుకు నోటు కేసు గురించిన చర్చ బాగా నడుస్తోంది. ఆ కేసులో పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. తాజాగా ఓటుకు నోటుకేసులో ఏసీబీ కోర్టులో జరుగుతున్న విచారణకు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గురువారం నాడు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇంకా విచారణ సాగుతూ ఉన్న సంగతి తెలిసిందే.
గురువారం నాటి వాయిదాకు ఎ-1 రేవంత్ రెడ్డి, ఏ-3 ఉదయసింహ్ హాజరయ్యారు. ఎ-2 సెబాస్టియన్ కోర్టుకు రాలేదు. న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబరు 24వ తేదీకి వాయిదా వేశారు.
ఇదేకేసుకు సంబంధించి.. చంద్రబాబునాయుడు పాత్రను తక్షణం నిగ్గు తేల్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దాని పర్యవసానంగా కొత్త ఎఫ్ఐఆర్ నమోదు సాధ్యం కాదు గానీ.. కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తర్వాత.. ఆ పిటిషన్ విచారణ సాగకుండా చంద్రబాబు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడమూ, వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి సుప్రీంకు వెళ్లి నాలుగు వారాల్లోగా ఆ విచారణ పూర్తి చేసేలా హైకోర్టుకు ఆదేశాలు వచ్చేలా చేయడమూ జరిగింది. అది మరొక ఎపిసోడ్ లాగా నడుస్తున్నది. అసలు మౌలికమైన కేసులోనే రేవంత్ రెడ్డి ప్రస్తుతం కోర్టుకు హాజరయ్యారు.