చంద్రబాబుకు ఎంత కష్టం...ఎంత నష్టం...?

Update: 2017-12-13 00:30 GMT

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కుదేలైపోతోంది. రానురాను నాయకులే కరువైపోతున్నారు. రెండు దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్లు సయితం పార్టీని వీడి వెళ్లేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. ఎన్నో పదవులు అనుభవించినా తమ రాజకీయ భవిష్యత్ కోసం మరో పార్టీలోకి జంప్ అవ్వడానికి వెనుకాడటం లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. చంద్రబాబు పూర్తి కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఉండటం, ఇక్కడ పార్టీని పట్టించుకోకపోవడంతో నేతలకు కూడా పార్టీలో ఉండే ధైర్యం లేకుండా పోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నడిపించే నాధుడే కరువయ్యారు. ఇటీవల టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడంతో పార్టీకి చాలా నష్టం జరిగిందనే చెప్పాలి. రేవంత్ తో పాటు తెలంగాణలోని 31 జిల్లాల్లోని క్యాడర్ కూడా ఆయన వెంట కాంగ్రెస్ లోకి వెళ్లిపో్యింది. రేవంత్ పార్టీని వీడి వెళ్లిన వెంటనే చంద్రబాబు హైదరాబాద్ వచ్చి తెలుగు తమ్ముళ్లకు ధైర్యం చెప్పారు. తానున్నానని భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని నేతలకు నమ్మకం కలిగించేలా మాట్లాడారు.

టీడీపీని వీడనున్న నేతలు....

కాని నవంబర్ 2వ తేదీన హైదరాబాద్ వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు మళ్లీ మరో సమావేశం ఏర్పాటు చేయలేదు. టెలికాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య నేతలతోనే మాట్లాడుతున్నారు అప్పుడప్పుడూ. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ నాయకత్వం నచ్చని కొందరు నేతలు ఇప్పటికే ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీతో దీర్ఘకాలం సంబంధం ఉన్న ఎలిమినేటి కుటుంబం పార్టీని వీడటానికి సిద్ధమయ్యింది. ఈ నెల 14వ తేదీన ఉమా మాధవరెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఉమా మాధవరెడ్డి తన కుమారుడు సందీప్ రెడ్డి రాజకీయ భవిష్యత్ గురించే పార్టీ మారుతున్నారు. ఇటీవల ఉమా కూడా తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ లేదని బాహాటంగానే చెప్పేశారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ను ఎదుర్కొనాలంటే అధికార టీఆర్ఎస్ కు ఎలిమినేటికుటుంబం అవసరం ఉంది. అయితే ఆ కుటుంబానికి ఎక్కడ సీటు కేటాయిస్తారన్నది 1985 నుంచి భువనగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి ఎలిమినేటి కుటుంబమే గెలుస్తూ వస్తుంది. ఏ ఎన్నికల్లోనూ వీరికి ఓటమి ఎదురుకాలేదు. 1985,1989, 1994, 1999 లో జరిగిన ఎన్నికల్లో ఎలిమినేటి మాధవరెడ్డి భువనగరి నియోజకవర్గం నుంచి గెలిచారు. మాధవరెడ్డి మరణానంతరం ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి ఉపఎన్నికతో పాటు 2004, 2009 ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అయితే తొలిసారి ఎలిమినేటి కుటుంబం 2014 ఎన్నికల్లో ఓటమిపాలయింది. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి శేఖర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఉమా మాధవరెడ్డి చేరికతో భువనగిరి సీటు ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి. ఉమా మాధవరెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారు. కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డితో పాటుగా వరంగల్ జిల్లా నేతలు కొందరు టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీంతో తెలంగాణలో టీడీపీ ఖాళీ అయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.

Similar News