తన మీద చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసమే కాదు రాష్ట్రంలోనే అడుగు పెట్టానని రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఏపీ సీఎం కి సవాల్ విసిరారు. పార్లమెంట్లో పోలవరం పై ప్రశ్నలు వేయడం, రాష్ట్రం పై భారం పడకుండా పోలవరాన్ని కేంద్ర సొమ్ముతోనే నిర్మించాలని కేసు వేయడంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కెవిపి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్ పై అవాస్తవాలను వాస్తవాలుగా తన మీడియా ద్వారా ప్రచారం చేస్తూ బాబు అసత్యాలు వల్లెవేస్తున్నారని కెవిపి ధ్వజమెత్తారు. పోలవరం కాంగ్రెస్ మానసపుత్రిక అన్నారు ఆయన. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం లో సత్యాగ్రహ దీక్ష సభలో పాల్గొన్న కెవిపి గత కొంతకాలంగా టిడిపి చేస్తున్న ఆరోపణలు విమర్శలకు సుదీర్ఘ కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ కి పోలవరం వల్ల అపాయం తలెత్తిందా ...?
పోలవరం ప్రాజెక్ట్ పనుల ఆలస్యంతో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి దూకుడు గా నిర్ణయాలు తీసుకున్నారని కెవిపి చెప్పారు. ఆ నిర్ణయాలవల్ల ఆయనకు ముప్పు ఉంటుందని కొందరు హెచ్చరించినా పట్టించుకోలేదని వైఎస్ అకాల మరణం మిస్టరీ పై అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ మరణం తరువాత పోలవరం కాంట్రాక్ట్ కోసం తామేదో చేశామని ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను టిడిపి నేతల ఆరోపణలను కెవిపి ఖండించారు. తొమ్మిదేళ్ళ పాలనలో ఏనాడూ టిడిపి పోలవరం ప్రాజెక్ట్ తలవలేదన్నారు. ఆ పార్టీకి చెందిన ఎమ్యెల్యే వడ్డి వీరభద్ర రావు, ఎర్రన్నాయుడు లకు గతంలో దేవెగౌడ ప్రధానిగా ఉండగా పోలవరం ప్రాజెక్ట్ కి అనుమతులు ఇస్తాం కట్టుకోమన్నా చంద్రబాబు పక్కన పెట్టేశారన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని కెవిపి ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా కేంద్రమే పోలవరం కట్టి ఇవ్వాలని కోర్ట్ లో కేసు వేస్తే తాను ప్రాజెక్ట్ కి అడ్డం పడుతున్నా అంటూ ప్రచారం చేయడం దారుణమన్నారు. టిడిపి ఎటాక్ కి కౌంటర్ ఎటాక్ ఇచ్చిన కెవిపి పై తమ్ముళ్లు ఇప్పుడు ఏ రేంజ్ లో విరుచుకుపడతారో చూడాలి.