చంద్రబాబు స్పీడ్ పెంచేశారు

Update: 2018-03-09 06:30 GMT

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు వరుస భేటీలవుతున్నారు. ముందుగా ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు ఎన్డీఏ లోకొనసాగాలా? వద్దా? అన్న దానిపై చర్చించారు. దీనిపై ఈరోజు జరిగిన పార్లమెంటుసభ్యుల టెలికాన్ఫరెన్స్ లో కూడా వారి అభిప్రాయాన్ని తీసుకున్నారు. ఎంపీలందరూ దాదాపు ముక్తకంఠంతో ఎన్డీఏ నుంచి బయటకు రావాలని చెప్పారు. ఎన్డీఏలో కొనసాగుతూ హామీల అమలు కోసం పోరాడాలని కొందరు ముఖ్యనేతలు సూచించారు. అయితే చంద్రబాబు అందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.

వైదొలగాల్సిందేనంటున్న....

కేంద్రమంత్రి పదవుల నుంచి తప్పుకున్న తర్వాత ఎన్డీఏలో కొనసాగడం అనవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్డీఏలో కొనసాగితే ప్రజలు నమ్మరని, వెంటనే తెగదెంపులు చేసుకోవడమే మంచిదని సూచించారు. దీంతో చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగాలా? వద్దా? కొనసాగితే పరిస్థితులేంటి? వైదొలిగితే ఎలా ఉంటుంది? అన్నదానిపై అధ్యయనం చేయడానికి ఒక స్ట్రాటజీ కమిటీని నియమించారు. ఈ స్ట్రాటజీ కమిటీలో యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, పరకాల ప్రభాకర్, కుటుంబరావులు ఉన్నారు.

స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు....

స్ట్రాటజీ కమిటీ అన్ని కోణాల్లో అధ్యయనం చేసి తనకు నివేదిక ఇవ్వాల్సిఉంటుందనిచంద్రబాబు ఆదేశించారు. కమిటీ సభ్యులు ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా తీసుకోవాలని సూచించారు. కమిటీ నివేదికను రెండు రోజుల్లో ఇవ్వాలని కోరారు. ఈ నెల 11వ తేదీన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలోనే చంద్రబాబు కమిటీ ఇచ్చే నివేదికను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్డీఏ లో కొనసాగాలా? వద్దా? అన్నది తేల్చడంతో పాటు రాజ్యసభ అభ్యర్థుల విషయం కూడా ముఖ్యనేతలతో చర్చించారు. మూడో అభ్యర్థిని నిలబెడితే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు ఈనెల 11న ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నట్లు చంద్రబాబు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Similar News