తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ వన్ ఏపీ అంటూ ప్రకటనలు చంద్రబాబు చెప్పిన లెక్కలు ఇప్పుడు కొంపముంచాయా ..? అవుననే అంటున్నారు విశ్లేషకులు. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు టిడిపి సర్కార్ కి మింగలేక కక్కలేని పరిస్థితిని తెచ్చిపెట్టాయి. అనుభవజ్ఞుడు అయిన తమ అధినేత సెల్ఫ్ గోల్ ఇలా వేసుకున్నారేమిటా అని కూడా పార్టీ సీనియర్లు సైతం మదన పడుతున్నారు. దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంటే మీకు ప్రత్యేక హోదా ఎందుకు ? కేంద్ర సాయం ఇంకెందుకు అంటూ నేరుగా బిజెపి సర్కార్ అధికారులతోనే చంద్రబాబుకి చెప్పించే ప్రయత్నం విజయవంతంగా చేయగలిగింది. కేంద్రం నుంచి ఇక ఏపీ అదనపు సాయం కోసం అడగాలిసిన పని లేదన్న సంకేతాలు ఇచ్చేసింది.
బాబు అనుకున్నది ఒకటి అయ్యేది మరొకటి ...
వాస్తవానికి చంద్రబాబు ఇలాంటి ప్రచారం చేయడంలో దిట్ట. దీనివల్ల ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో ఆయన చాలా లబ్ధిని చవిచూశారు. అది ఏ రకంగా అంటే పెట్టుబడులను ఆకర్షించడంలో. చెన్నయి, ముంబాయి, బెంగుళూరు లకు ధీటుగా హైదరాబాద్ లో అంతా పెట్టుబడులు పెట్టేలా ఆయన అంకెల మాయతో నాడు రాణించారు. కానీ ఇప్పడు విభజన తరువాత పరిస్థితి పూర్తిగా భిన్నమైనది. ఏపీ గా తెలంగాణ నుంచి విడిపోయాక కొత్త రాష్ట్రం 16 వేలకోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ప్రారంభం అయ్యింది. అప్పులు లక్ష కోట్ల పైకే చేరుకున్నాయి. తుమ్మితే ఊడిపోయే ముక్కులా వుంది ఏపీ పరిస్థితి . రాజధాని లేదు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, వ్యవసాయ ఆధారితంగా వచ్చే ఆదాయం తప్ప మరో దారీతెన్నూ లేవు. ఈ సమయంలో పెట్టుబడులను ఆకర్షించి ఏపీని తీర్చిదిద్దాలని ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు తిరుగుతూనే వున్నారు.
సన్ రైజ్ స్టేట్ అంటూ....
అలా వెళ్ళినప్పుడు సన్ రైజ్ ఏపీ అంటూ బాబు జిడిపి రేటు అధికంగా చూపిస్తూ అనేక అవకాశాలు ఏపీలో వున్నాయంటూ చెప్పుకొచ్చేవారు. జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏపీ ఎంతో బెటర్ అంటూ చెప్పిన చంద్రబాబుకి ఇప్పుడు కేంద్రం ఇవే లెక్కలు చూపిస్తూ అలాంటప్పుడు సాయం ఎందుకు అంటూ చుక్కలు చూపించడం తో బిత్తర చూపులు చుడాలిసిన పరిస్థితి ఎదురైంది. ఏపీలో ఇంత అభివృద్ధి వున్నప్పుడు కేంద్రాన్ని ఎందుకు అడుక్కుంటారు అనే ప్రశ్న సమర్ధంగా యంత్రాంగం చేతే చెప్పించి రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకుంది బిజెపి సర్కార్. దీనికి దక్షిణాదిన వున్న మిగిలిన నగరాలకు ధీటుగా ఏపీ ఎదగడానికి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కు (అంటే మిగిలిన మహానగరాల ఆదాయంతో పోటీ పడే స్థాయిలో ఎదిగే వరకు ) అవకాశం కల్పించాలని వేడుకోవడం తప్ప ఏమి చేయలేకపోతున్నారు.