ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి భరోసాగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజలు ప్రభుత్వం పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారన్నారు. అయితే ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దని నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. పత్రికల్లో వస్తున్న సర్వేలను చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాసంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్లనే ప్రజలు పూర్తి స్థాయిలో పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఎమ్మెల్యేలు మారాల్సిందే....
కొద్దిసేపటి క్రితం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్లమెంటు ఇన్ చార్జులపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటు ఇన్ ఛార్జులుగా మంత్రులను చంద్రబాబు నియమించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి ప్రజా సమస్యలతో పాటు పార్టీ పరంగా ఉన్న సమస్యలను తొలగించాల్సిన బాధ్యత ఇన్ ఛార్జులదేనన్నారు. జన్మభూమి గ్రామ సభల్లోనూ ప్రజల్లో వ్యతిరేకత రాలేదంటే ప్రభుత్వం పనితీరు తెలిసిపోతుందన్నారు. అయితే నిత్యం ప్రజల్లో్ ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తేనే గెలుపు సాధ్యపడుతుందని హితబోధ చేశారు. తనకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం ప్రజలు మళ్లీ టీడీపీనే కోరుకుంటున్నారని, కాని కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, వారు మారాలని సూచించారు.
ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని....
వైసీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని చేర్చుకోవడంలో సమస్యలేమైనా ఉన్నాయా? అని మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా చంద్రబాబును సమావేశంలో అడిగారు. అయితే స్థానికంగా పార్టీలో ఉన్న వాతావరణం, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చేర్చుకుంటే మంచిదేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎవరు పార్టీలో చేరాలని వచ్చినా కండువా కప్పేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే షరతులు విధిస్తే అంగీకరించేది లేదని కూడా చెప్పారు. రాజకీయ పునరేకీకరణ కోసమే ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నామన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు చెప్పాలని చంద్రబాబు నేతలకు సూచించారు. కోడిపందేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం మానుకోవాలన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుందని ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. మరింత జాగ్రత్తగా ఉండకపోతే అసలుకే మోసం వస్తుందని హెచ్చరించారు.