తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లో పడేశాలా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. మిత్రపక్షాలపై సంయమనం లేకుండా పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇరకాటంలో పడేస్తున్నాయి. చంద్రబాబు అనేక సమావేశాల్లో ఈ విషయం స్పష్టం చేసినా నేతల తీరు మారకపోవడంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కల్యాణ్ పై మంత్రి పితాని చేసిన వ్యాఖ్యలు, గతంలో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఆరా తీశారు. ఏ సందర్భంలో అలా వీరు అనాల్సి వచ్చిందో కనుక్కోవాలని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి సూచించారు. అశోక్ గజపతి రాజు ఐదు నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. అప్పడు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ పవన్ కల్యాణ‌్ ఎవరో తనకు తెలియదని, తాను సినిమాలు అసలు చూడనని చెప్పారు. అప్పట్లో అశోక్ వ్యాఖ్య పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేసింది.
పితానిని వివరణ కోరిన చంద్రబాబు......
తాజాగా మంత్రి పితాని సత్యనారాయణ కూడా పవన్ పైనా, ఆయన పార్టీ పైనా వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ మాత్రమేనని, జనసేన కాదని వచ్చే అర్థంలో పితాని మాట్లాడారు. దీనిపై పవన్ ట్వీట్ చేయడం టీడీపీలో కలకలం రేపింది. పవన్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. ఇమేజ్ ఉన్న నేత. అలాగే కాపు సామాజిక వర్గ ఓటర్లను ప్రభావితం చేయగలిగిన వ్యక్తి. అలాంటిది చంద్రబాబుతో పాటు ప్రభుత్వం కూడా పవన్ సంధించే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెబుతున్నారు. పవన్ తో సన్నిహితంగా మెలగాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో పితాని వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు తెలిసింది. అలాగే విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీ చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో దుమారం రేపాయి. మిత్రపక్షాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిపై పితానిని చంద్రబాబు వివరణ కోరనున్నారు. మొత్తం మీద పవన్ ట్వీట్ పార్టీలో కలకలం రేపిందనే చెప్పాలి.