వైసీపీ అధినేత జగన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు, మోడీ.... వెంకయ్య నాయుడులను టార్గెట్ గాచేసుకుని మాట్లాడారు. అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన యువభేరి కార్యక్రమంలో జగన్ ప్రసంగించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందన్నారు. ఎన్నికల సమయంలో పబ్లిక్ గా హామీలిచ్చి వాటిని తుంగలో తొక్కారన్నారు. ప్రత్యేక హోదాతో ఏపీకి ఇచ్చి ఉంటే ఈ మూడేళ్లలో లక్షల ఉద్యోగాలు వచ్చేవని జగన్ అభిప్రాయపడ్డారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్నే మర్చిపోయారన్నారు. పైగా యువభేరికి వచ్చే యువతపై పీడీ యాక్ట్ పెడతామని, కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం బెదిరిస్తుందని ఆరోపించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిన పాలకులు గుడ్డివాళ్లా? చెవిటివాళ్లా? అని జగన్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా గత ఎన్నికల సభల్లో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన యువభేరిలో ప్రదర్శించారు.
అన్నీ అబద్ధాలు....శుష్క వాగ్దానాలే.....
అనంతపురం జిల్లా పూర్తిగా వెనకబడిపోయిందని, రాజస్థాన్ లా మారిన ఈ జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని చంద్రబాబును కోరారు. రాయలసీమకు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు ఏమయిందన్నారు. అనంతపురంలో ఎయిమ్స్ కు అనుబంధ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు ఇప్పటి వరకూ దానికి అతీగతీ లేదన్నారు. అనంతపురంలో నూతన పారిశ్రామిక నగరం ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇవి ఎక్కడైనా కన్పించాయా? అని ప్రశ్నించారు. అనంతపురం స్మార్ట్ సిటీగా చేస్తానని ప్రకటించిన చంద్రబాబు ఏమయిపోయారన్నారు. బెంగుళూరు - చెన్నై క్యారిడర్ ఏర్పాటు, టెక్స్ టైల్ పార్కు ఏమయ్యాయన్నారు. ఫుడ్ పార్క్ మీకెక్కడయినా కన్పించిందా? అని యువభేరికి వచ్చిన యువతను జగన్ అడిగారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు, చెబుతున్న అబద్ధాలను ప్రశ్నించాలన్నారు. అధికారం రావడం కోసం చంద్రబాబు ఎంతటి మోసాలకైనా పాల్పడతారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు అయిన రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణాలరద్దు, జాబు కావాలంటే బాబు రావాలి... నిరుద్యోగులకు 2వేల భృతి వంటి హామీలను కూడా పాత వీడియో క్లిప్పులను ప్రదర్శించారు. మొత్తం మీద జగన్ యువభేరిలో మోడీ, చంద్రబాబు, వెంకయ్యనాయుడు గతంలో చేసిన ప్రసంగాలను మరోసారి జగన్ గుర్తుకుతెచ్చారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదా కోసం అమ్మేశారన్నారు.