చంద్రబాబు మదిలో ఏముంది?

Update: 2017-11-02 08:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కమలనాధులపై లోలోపల కసిగా ఉన్నారు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవమున్న తనను పూచిక పుల్లతో సమానంగా చూడటంపై ఆయన ఆవేదన చెందుతున్నారు. ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ నేతలు పార్టీపైనా, ప్రభుత్వంపైనా విమర్శలు చేయడం మరోవైపు కేంద్రంలో రాష్ట్రానికి సంబంధించి పనులు కాకపోవడంతో చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాలను తన సన్నిహితుల వద్ద పంచుకున్నట్లు తెలుస్తోంది. మోడీ సర్కార్ వన్ సైడ్ గా వెళుతుందని, కాని ఏపీ రాష్ట్రం కోసం భరిస్తున్నామని ఆయన చెబుతున్నారు. రావాల్సిన నిధులు ఇవ్వకుండా, హామీలు అమలుపర్చకుండా కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడలను అవలంబిస్తుందని ఆయన బహిరంగంగానే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పోలవరం దగ్గర నుంచి ప్రతి పనిలో కేంద్రం అడ్డంకులను సృష్టించడాన్ని తాను మౌనంగా భరించడం కేవలం రాష్ట్రం కోసమేనని ఆయన అంటున్నారు.

బీజేపీతో ఇక కటీఫ్.....?

అయితే గుజరాత్ ఎన్నికల ఫలితాల తర్వాత మోడీ పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తే చంద్రబాబు రివర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఒంటరిగానే పోటీకి వెళ్లాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాలు మోడీ ఇమేజ్ ను ప్రజల్లో బాగా తగ్గించడంతో ఇక మోడీతో కలిసి వెళ్లడం వేస్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే గుజరాత్ ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చేయి ఇచ్చిన విషయాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన భావిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోగా, ప్రకటించిన ప్యాకేజీ నిధులను కూడా విడుదల చేయకపోవడాన్ని బహిరంగంగానే చంద్రబాబు తప్పుపట్టనున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీని తూర్పారపట్టి కేంద్రం సహకరించకపోవడం వల్లనే తాను కొన్ని పనులను చేయలేకపోయానని, ముఖ్యంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు వంటి వాటిని ప్రస్తావించనున్నట్లు తెలిసింది. మొత్తం మీద మోడీతో కటీఫ్ కే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు.

Similar News