చంద్రబాబు బరస్ట్ అయ్యారే....!

Update: 2018-01-27 11:30 GMT

చంద్రబాబు కఠిన నిర్ణయానికి వచ్చినట్లున్నారు. బీజేపీతో తెగదెంపులకు సిద్ధమయినట్లే కన్పిస్తోంది. చంద్రబాబు ఏకంగా బీజేపీ అధిష్టానానికే ఒకరకంగా హెచ్చరికలు పంపారు. మిత్ర ధర్మం వల్లనే తాము బీజేపీని విమర్శించలేకపోతున్నామని చేసిన చంద్రబాబు వ్యాఖ్యలు పొత్తు నుంచి తప్పుకోవడానికే డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీ నేతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధిష్టానానిదేనని చెప్పారు. పొత్తు వద్దనుకుంటే తాము కూడా ఒక నమస్కారం పెట్టి వదిలించుకుంటామని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీతో కలిసి నడుద్దామన్న ఆలోచన చంద్రబాబుకు లేనట్లుంది.

మోడీతో సమావేశం తర్వాతకూడా....

విభజనకు గురైన ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సాయం అందించడం లేదు. ఇటీవల ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో సయితం పెద్దగా స్పందన కన్పించడం లేదు. ఒక పోలవరం పనులు మందగించాయి. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వచ్చే ఎన్నికలకు వెళితే ఇబ్బందులు తప్పవన్నది చంద్రబాబు గ్రహించారు. అయితే కేంద్రం అండ లేనిదే ముందుకు పోవడం కష్టమని భావించిన చంద్రబాబు ఇప్పటి వరకూ ఓపిక పడుతూ వచ్చారు. ఎన్నిమార్లు ఢిల్లీ తిరిగినా, వినతులు సమర్పించినా పట్టించుకోక పోవడంపై ఆయన అంతర్గతంగా ఆవేదనతో పాటు ఆగ్రహంతోనూ ఉన్నారు.

హైకమాండ్ అండతోనే....

దీంతోపాటు ఏపీ బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని పార్టీ నేతలు భరించలేకపోతున్నారు. తాము మంత్రివర్గంలో అవకాశం ఇచ్చి అన్ని రకాలుగా సాయం అందిస్తున్నా కొందరు బీజేపీ నేతలు ప్రభుత్వంపై ఇష్టంవచ్చినట్లు వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన సహించలేకపోతున్నారు. గత కొన్ని నెలలుగా జరుగుతున్నా అధిష్టానం వీటిని పట్టించుకోలేదు సరికదా...వారిని కంట్రోల్ లో పెట్టే ప్రయత్నం చేయలేదు. అంటే హైకమాండ్ అండతోనే ఇక్కడి బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలుచేస్తున్నారన్న అనుమానం కూడా టీడీపీ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యలు చేశారని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద బీజేపీతో కలిసి నడవాల్సిందేనన్న ఆలోచన చంద్రబాబుకు లేనట్లుంది. మొత్తం మీద ఇన్నాళ్లకుచంద్రబాబు బరస్ట్ అయ్యారని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

Similar News