చంద్రబాబు టైం చూసి నొక్కారే...!

Update: 2018-01-05 03:30 GMT

చంద్రబాబు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. బీజేపీని తన కాళ్ల బేరానికి తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు. రాజ్యసభలో జరిగిన తంతు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం, ఇతర ప్రాజెక్టుల విషయంలో కేంద్రం చూపిస్తున్న వైఖరికి చంద్రబాబు ఇప్పటి వరకూ మౌనంగానే ఉంటూ వస్తున్నారు. ఆయన ఓపిక పడుతున్నారని, సహనానికి కూడా హద్దుంటుందని టీడీపీ నేతలు కూడా బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని నెలలుగా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కూడా చంద్రబాబుకు దక్కడం లేదు. పైగా ప్రతిపక్ష నేత జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడం చంద్రబాబును కలిచివేసింది.

కేంద్రం పట్టించుకోవడం లేదని.....

మోడీ మొండోడని చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే జాగ్రత్తగా ఇప్పటి వరకూ కేంద్రంతో డీల్ చేసుకుంటూ వస్తున్నారు. మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నా తమను పట్టించుకోవడం లేదన్నది చంద్రబాబు ఆవేదన. ఎన్నిమార్లు తిరిగినా కేంద్రం తమ విన్నపాలను బుట్టదాఖలాలు చేస్తుందని లోలోపల మధనపడుతున్నారు. కొందరు టీడీపీ నేతలు గట్టిగా మిత్రపక్షంపై విమర్శలు చేస్తున్నా వారిస్తూ చంద్రబాబు వస్తూ తనకంటూ ఒక వ్యూహాన్ని రూపొందించుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో వైరం ఎందుకులే అని సమయం కోసం వేచి చూస్తున్నారు చంద్రబాబు.

టైం వచ్చేసింది...

చంద్రబాబు అనుకున్న సమయం రానే వచ్చింది. లోక్ సభలో మెజారిటీ ఉంది కాబట్టి ట్రిపుల్ తలాక్ బిల్లు సులువగా గట్టెక్కింది. కాని పెద్దల సభలో అది సాధ్యం కాదన్నది చంద్రబాబుకూ తెలుసు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు గట్టిగా ఆందోళనకు దిగాయి. అయితే విచిత్రమేమిటంటే విపక్షాలకు మద్దతుగా టీడీపీ సభ్యులు కూడా చేతులు కలపడం. ఎన్డీఏ లో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో అడ్డం తిరిగిందని బీజేపీకి అర్థమయింది. ఇదంతా చంద్రబాబు ప్లాన్. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను, నిధులను సత్వరం విడుదల చేయించుకోవడం కోసం చంద్రబాబు ట్రిపుల్ తలాక్ బిల్లుకు అడ్డం తిరిగారన్నది అర్థమవుతోంది. అంతేకాకుండా ఏపీలోని ముస్లిం ఓట్లను కూడా క్యాష్ చేసుకోవచ్చన్నది ప్లాన్. మోడీ ఇప్పటికైనా తనకు ఫోన్ చేయాలన్నది చంద్రబాబు వ్యూహంగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Similar News