తెలుగుదేశం అధినేత చంద్రబాబు పెట్టిన టార్గెట్ లు ఎమ్మెల్యేలు రీచ్ అవుతారా? అందుకోసం వారు నియోజకవర్గంలో కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇంతకీ చంద్రబాబు పెట్టిన టార్గెట్ ఏంటో తెలుసా? మిగిలిన పార్టీల నేతలను పార్టీలోకి తీసుకొచ్చేయడం. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన నేతలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలోకి తీసుకురావాలన్నది చంద్రబాబు ఆదేశం. దీనివల్ల రాజకీయ పునరేకీకరణ జరుగుతుందని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇప్పటి వరకూ వైసీపీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలకు పసుపు కండువా కప్పేసిన చంద్రబాబు ఇక ద్వితీయ శ్రేణి నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై దృష్టి సారించారు. అందరూ కలిస్తేనే విజయమని భావించిన చంద్రబాబు గ్రామ స్థాయినేతలను కూడా వదిలపెట్ట వద్దని ఎమ్మెల్యేలకు గట్టిగా సూచించారు. దీంతో ఎమ్మెల్యేలు, మంత్రులు గత కొద్ది రోజులుగా ఇదే పనిలో ఉన్నారు.
టీడీపీ సెకండ్ క్యాడర్ లో అసహనం....
అయితే గత ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎలా పార్టీలోకి రమ్మనాలా? అని ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు. ఇలా చేస్తే అసలుకే ఎసరు వస్తుందని జిల్లా మంత్రులకు కొందరు చెప్పినా చంద్రబాబు ఆదేశం కావడంతో తామేమీ చేయలేమంటున్నారు. నిన్న మొన్నటివరకూ వైరి వర్గంగా ఉన్న నేతలను పార్టీలోకి తీసుకొస్తే టీడీపీ కోసం ఇన్నాళ్లూ పనిచేసిన వారు తమ సంగతేంటని ప్రశ్నించే అవకాశముంది. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గురునాధరెడ్డినే తీసుకుంటే ఆయన టీడీపీలో చేరడంతో కొందరు అనంతపురం టౌన్ లో పెద్దయెత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలపై టీడీపీ ద్వితీయ శ్రేణినేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. మొన్నటి ఎన్నికల్లో హోరాహోరీ తలపడి బూత్ ల వద్ద తాము కొట్లాటలకు దిగితే ఇప్పుడు అదే వర్గం పార్టీలో చేరడమేంటని కొందరు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వద్దకు వచ్చి నిలదీశారట. ఇలా అనేక నియోజకవర్గాల్లో పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చంద్రబాబు ఆదేశాలను పాటించాలా? లేక టీడీపీ కార్యకర్తలను సముదాయించాలో తెలియక కొందరు ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. ఇది ముఖ్యంగా ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఉందని చెబుతున్నారు.