చంద్రబాబు చేశారు.. కేసీఆర్ ను చేయనివ్వలేదు

Update: 2016-09-26 07:11 GMT

రెండు తెలుగు రాష్ట్రాలనూ వర్షాలు కుదిపేస్తున్నాయి. జనానికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఏపీలో ఆదివారం నాడు వర్షం కాస్త తెరపి ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏరియల్ సర్వే నిర్వహించి, వర్షాల నష్టం ఏమేరకు ఉన్నదో ఓ అంచనాకు వచ్చారు. పంటపొలాలు ఎలా దెబ్బతిన్నాయో గమనించారు. సాధారణంగా ప్రతి విషయంలోనూ తెలుగు ముఖ్యమంత్రులు ఇద్దరూ ఒకరి జాడల్లో ఒకరు నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏరియల్ సర్వే చేయడానికి సోమవారం ముహూర్తం నిర్ణయించుకున్నారు. అయితే చేయలేకపోయారు.

తెలంగాణలో వాతావరణం ఇంకా పూర్తిగా కుదుటపడని నేపథ్యంలో.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారు.. కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా విహంగ వీక్షణం చేయడానికి అనుమతించలేదని సమాచారం. కేసీఆర్ మాత్రం వరద బాధిత ప్రాంతాల పర్యటన గురించి శ్రద్ధగా ఉండడంతో మధ్యాహ్నం తర్వాత అయినా వాతావరణం అనుకూలిస్తే.. ఏటీసీ వారు అనుమతించవచ్చునని అనుకుంటున్నారు.

ఇరు రాష్ట్రాల్లోనూ అటు రైతులకు, ఇటు ప్రభుత్వ ఆస్తులకు వాటిల్లిన వరద నష్టాన్ని అంచనా వేసే అప్పుడే ప్రారంభం అయింది. ఏ మేరకు నష్టపోయిన వారికి ఏయే దామాషాలో సాయం అందించబోయేది కూడా చంద్రబాబు అప్పుడే ప్రకటించేశారు. తెలంగాణలో ఇంకా నష్టం అంచనాలు తేలాల్సి ఉంది.

Similar News