చంద్రబాబు నాయుడు చేసిన సస్పెన్షన్లు పేరుకే అన్నది మరోసారి రుజువయింది. కేవలం ప్రచారం కోసమే సస్పెన్షన్లు చేస్తారని, ఆ విషయం ప్రజలు మరిచిపోయిన తర్వాత తిరిగి దగ్గరకు తీసుకుంటారన్నది స్పష్టమయింది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతుంది. అవినీతికి తావులేని పాలనను ప్రజలకు అందిస్తానని చంద్రబాబు తరచూ చెబుతూ వస్తున్నారు. ఎక్కడ అవినీతి జరిగినా తాను సహించనని, అవినీతిపరుల గుండెల్లో నిద్రబోతానని చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు కొన్ని అవినీతి ఆరోపణల్లోచిక్కుకున్నారు. వెంటనే వారిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడంతో టీడీపీ నేతల్లో కూడా కంగారు మొదలయిందనే చెప్పొచ్చు.
వాకాటిని సస్పెండ్ చేసినా....
దీంతో ఎమ్మెల్యేలు కూడా ఒకింత జాగ్రత్త పడుతూ వస్తున్నారు. తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకుండా చూసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సీబీఐ కేసులో చిక్కుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరపగానే పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి. బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణను వాకాటి ఎదుర్కొన్నారు. వెంటనే వాకాటిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది జరిగి ఏడాది దాటి పోయింది. అయితే ఇప్పటికీ వాకాటి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. అధికారికంగా సస్పెన్షన్ ను తొలగించకపోయినా వాకాటి నారాయణరెడ్డి నిన్నటిదాకా జరిగిన జన్మభూమి కార్యక్రమం విజయవంతానికి తన వంతు పాత్ర పోషించారు. మంత్రి నారాయణ సూచనతో ఆయన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
దీపక్ రెడ్డితో ఒకే వేదికపై....
ఇక తాడిప్రతి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అల్లుడు దీపక్ రెడ్డి హైదరాబాద్ భూకుంభకోణం కేసులో ఇరుక్కున్నారు. ఆయన జైలుకు కూడా వెళ్లారు. తొలినాళ్లలో జేసీ నోటికి భయపడిన చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకోలేదు. అయితే జైలుకు వెళ్లడంతో దీపక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ సస్పెన్షన్ జరిగి కూడా దాదాపు పది నెలలు దాటింది. అయితే దీపక్ రెడ్డి ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభలో ఆయన వేదికపై కూర్చున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన జన్మభూమి గ్రామసభలో దీపక్ రెడ్డి పాల్గొనడం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది.
బొల్లినేనిపై చర్యలేవీ?
అయితే దీపక్ రెడ్డి మీద సస్పెన్షన్ ను ఇప్పటి వరకూ ఎత్తివేయలేదు. వాకాటి మీద కూడా అంతే. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ టీడీపీ నేతల్లాగానే పాల్గొంటున్నారు. అయితే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావుపై మహారాష్ట్రలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన మహారాష్ట్రలో చేపట్టిన కాంట్రాక్టు పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఏసీబీ కేసు కూడా నమోదు చేసింది. ఆయన కోసం మహారాష్ట్ర పోలీసులు వెదుకుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్సీలపై తీసుకున్న చర్యలు ఎమ్మెల్యేపై తీసుకోలేదన్న విమర్శలు కూడా పార్టీలో విన్పిస్తున్నాయి. అయితే చంద్రబాబు సస్పెన్షన్నీ ఉత్తుత్తివేనని, పార్టీకి పనికొచ్చే వారిని ఎలా వదులుకుంటారని టీడీపీనేతలే ఎదురు ప్రశ్నలు వేస్తుండటం గమనార్హం.