చంద్రబాబు, కేసీఆర్ కోరిక నెరవేరనుందా?

Update: 2017-11-04 06:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ నియోజకవర్గాల పెంపు చర్చకు వచ్చింది. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష సమావేశంలోనూ ఈ విషయాన్నిప్రస్తావించారు. ఖచ్చితంగా నియోజకవర్గాల పెంపు ఉంటుందని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. మరోవైపు శుక్రవారం చంద్రబాబు ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కూడా కలిసి నియోజకవర్గాల పెంపు ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు వచ్చే అవకాశముందని టీడీపీ వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నియోజకవర్గాల పెంపు అవసరం. ఇబ్బడి ముబ్బడిగా ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న నేతలను, అప్పటికే పార్టీలో ఉన్న నేతలకు సీట్లను సర్దుబాటు చేయాలంటే నియోజకవర్గాల పెంపు అవసరం. చంద్రబాబు శుక్రవారం రాజ్ నాథ్ సింగ్ ను కలిసి నియోజకవర్గాల పెంపుపై మాట్లాడారు. రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు బాబు చెప్పారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా ఫోన్ లో మాట్లాడినట్లు చంద్రబాబు చెప్పారు.

ఢిల్లీలో పెద్దయెత్తున లాబీయింగ్....

అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ను సవరించాలా? లేక విభజన చట్టంలోని 26వ సెక్షన్ సవరించాలా? అన్న దానిపై కేంద్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. అటార్నీ జనరల్‌ మాత్రం విభజన చట్టంలోని సెక్షన్‌ 26ని అమలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170(3)ని సవరించాల్సి ఉంటుందని గతంలోనే న్యాయశాఖకు సలహా ఇచ్చారు.రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పెంపునకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలున్నాయి. వీటిని 225కి పెంచాల్సి ఉంటుంది. కేవలం అసెంబ్లీ నియోజకవర్గాలే పెరుగుతాయి. లోక్ సభ స్థానాలు అలాగే ఉంటాయి. లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలను మాత్రమే పెంచాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో ప్రస్తుతమున్న 119 స్థానాలు 153కి పెరిగే అవకాశముంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం చంద్రబాబు పర్యటనలో ఎక్కువగా నియోజకవర్గాల పెంపుపైనే కేంద్ర మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాలు పెంచకుంటే రాష్ట్రాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొంటుందన్న వాదనను ఇద్దరు ముఖ్యమంత్రులు గట్టిగా చెబుతున్నారు. అయితే రెండు రాష్ట్రాల్లోని బీజేపీ శాఖలు మాత్రం నియోజకవర్గాల పెంపును వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Similar News