చంద్రబాబు ఇక సర్దేసుకుంటున్నట్లేనా?

Update: 2018-02-02 07:30 GMT

చంద్రబాబు టోన్ మార్చేస్తున్నారు. రాజస్థాన్ ఉప ఎన్నికలను ఉదాహరణగా చూపుతున్నారు. నిన్న జరిగిన కౌంటింగ్ రాజస్థాన్ లో జరిగిన రెండు పార్లమెంటు స్థానాలు, ఒక అసెంబ్లీ సీటు వాష్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలను గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. పరిపాలన బాగుండకపోతే ఏ రాష్ట్ర ప్రజలు ఆదరించరన్న విషయం రాజస్థాన్ ఉప ఎన్నికల్లో స్పష్టమైందన్నారు. మనం కూడా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

రాజస్థాన్ ఎన్నికల ప్రస్తావన....

ఎవరూ అతివిశ్వాసానికి వెళ్లవద్దని చంద్రబాబు హితవు చెప్పారు. నిన్నటి బడ్జెట్ దారుణమన్న చంద్రబాబు ముంబై, అహ్మదాబాద్, కర్ణాటకలకు మాత్రం నిధులు బాగానే కేటాయించారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న నాలుగేళ్ల తర్వాత తొలిసారి కొంచెం ఘాటుగానే వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో కనీసం నిధులను కేటాయించకపోవడం ఆవేదన కల్గించిందన్నారు. ఇలాగైతే ప్రజల్లోకి ఎలా వెళ్లగలమని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం ఎవరూ సీరియస్ గా ప్రయత్నించలేదన్నారు. నాడు రాజ్యసభలో వెంకయ్యనాయుడు కొంత పట్టుబట్టి తర్వాత వదిలేశారన్నారు.

సమావేశంలో మిశ్రమ స్పందన....

అలాగే పార్లమెంటు సభ్యులు, మంత్రుల నుంచి బడ్జెట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుందన్నారు. ప్రజలు కూడా అంతా గమనిస్తున్నారని, రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే ప్రజలు ఎలా తిరిగి మద్దతిస్తారన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని బీజేపీ చెప్పుకుంటుందని కొందరు మంత్రులు ప్రస్తావించగా, అదే ధోరణని అవలంబిస్తే మనం కూడా మన దారి చూసుకుందామన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులు ఈ సందర్భంగా చంద్రబాబుపై వత్తిడి తెచ్చారు. తాను ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా పట్టించుకోక పోవడంపై చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయినట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు, ముఖ్యనేతల నుంచి సమాచారాన్ని చంద్రబాబు సేకరించారు. కొందరు మంత్రులు బీజేపీతో తెగదెంపులు చేసుకోవాల్సిందేనని చెప్పగా, మరికొందరు మంత్రులు మాత్రం తిరిగి మోడీయే అధికారంలోకి వస్తారని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని, ఇప్పుడు విడిపోతే వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మొత్తం మీద టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ వైఖరి పట్ల చంద్రబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Similar News