ఢిల్లీ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ఏపీ సమస్యల పరిష్కారానికి దారి చూపిస్తుందని అంతా భావించారు. కానీ అనుకున్నది ఒక్కటి అక్కడ జరిగింది మరొకటిగా ముఖ్యమంత్రి హస్తిన నుంచి వచ్చాక మాట్లాడుతున్న మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ పునర్విభజన తరువాత ఏర్పడిన అనేక సమస్యలు ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ళు అయినా, నేటికీ కొన్నయినా నెరవేరలేదు. ఇది టిడిపి సర్కార్ ను తీవ్రంగా వేధిస్తుంది. కేంద్రం రాష్ట్రం మిత్రపక్షాలుగా వుంటూ కనీస సమస్యలు కూడా ఏపీకి పరిష్కారం కాలేదంటే రెండు పార్టీలు ప్రజల ముందు దోషులుగా నిలబడే వాతావరణం చంద్రబాబు కి స్పష్టం అయ్యింది. దాని ప్రభావం ఇరుపార్టీలపై రాబోయే ఎన్నికల్లో తీవ్రంగానే పడే అవకాశం ఉన్నట్లు చేస్తున్న సర్వేలు చెప్పేస్తున్నాయి. నంద్యాల, కాకినాడ మాదిరి ఎన్నికల మేనేజ్మెంట్ సాధారణ ఎన్నికల్లో చేయడం సాధ్యం కాదు. ఇవన్నీ గమనించే తప్పులన్నీ కేంద్రంపై ఒప్పులన్నీ తనకు జమ వేసుకునే పని మొదలు పెట్టేశారు పొలిటికల్ మాస్టర్ మైండ్ చంద్రబాబు.
ఇక లాభం లేదనే ....
ఆరంభమే లోటు బడ్జెట్ తో ప్రారంభం అయిన ఆంధ్రప్రదేశ్ కు అప్పులే వరం. ఈ వరాలు ఏ బ్యాంక్ ఇవ్వాలన్నా కేంద్రం గ్యారంటీ సంతకాలు చాలా వరకు అవసరం. దాంతో చంద్రబాబు గత నాలుగేళ్లుగా కేంద్రం దయా దాక్షిణ్యాలతో సర్కార్ బండి ఈడుస్తున్నారు. దొరికిన చోటల్లా అప్పుతెచ్చి సంక్షేమ కార్యక్రమాలతో ఓటు బ్యాంక్ లకు చిల్లులు పడకుండా జాగ్రత్త వహించారు. ఆయన చేసిన దుబారా వ్యయాలు పట్టిసీమ వంటి ప్రాజెక్టులపై కాగ్ కడిగేయడం, ఇటీవల పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఏపీ ఆర్ధిక డొల్ల తనం లెక్కలతో సహా బయటపెట్టేయడం తో ఎంతోకాలం ఈ పరిస్థితిని దాయలేం అన్న సత్యాన్ని బాబు గ్రహించారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై నేరుగా యుద్ధం చేస్తే అసలుకే ఎసరు వస్తుందని భావించిన చంద్రబాబు న్యాయస్థానాలను ఆశ్రయించే స్కెచ్ గీశారు. దానివల్ల ప్రజలు అడిగినా రాష్ట్రానికి రావలిసిన వాటిపై కోర్ట్ ల్లో కేసులు నడుస్తున్నాయని చెప్పుకోవడం బిజెపితో పొత్తు లేకపోతే ఎన్నికల్లో ఆ పార్టీపై ఈ కేసులనే అస్త్రాలుగా చేయాలన్నది బాబు ప్లాన్ అంటున్నారు కొందరు విశ్లేషకులు. వేచి చూసి చూసి విసిగి పోయి బాబు కోర్ట్ జపం అందుకున్నట్లు మరికొందరు టిడిపి నేతలు ఆఫ్ ది రికార్డ్ లో చెబుతున్నారు.
బిజెపి టిడిపి పొత్తుకు అర్ధం లేదే ...
సమస్యలు పరిష్కారం కావడం లేదనో, ఆశించిన సహకారం కేంద్రం నుంచి లభించడం లేదనో చంద్రబాబు కోర్టు గుమ్మం ఎక్కితే ఇరు పార్టీలు రాజకీయంగా మైనస్ లో పడతాయంటున్నారు కొందరు. ఎన్డీయే లో భాగస్వామిగా వుంటూ కేంద్రంలో నలుగురు మంత్రులను కొనసాగిస్తూ, రాష్ట్రంలో బిజెపి మంత్రులకు చోటిచ్చి సమస్యలు పరిష్కారం చేసుకోలేకపోతే చేతగానివారిగా మిగిలిపోతామని భావిస్తున్నారు. తన వారిచేత ఎందుకు రాజీనామా చేయిస్తానని లేక తాను ఇలా అయితే రాజీనామా చేస్తానని బాబు ఎందుకు ప్రకటించడం లేదన్న వాదన మొదలౌతుంది. గతంలో పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలపకపోతే ప్రమాణ స్వీకారం చేయనని మోడీ ని బెదిరిస్తే పని అయ్యిందని పదే పదే చంద్రబాబు ఇప్పటికి చెబుతారు. అదే తీరులో ఇప్పుడు మోడీ సర్కార్ కి అమరావతి , పోలవరం నిధులు , రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంశాల్లో చేసి ఉంటే ఫలితం ఉండేదని ఎన్నికల ముందు ఆయన ఇప్పుడు కోర్ట్ కి వెళతా అనడం వల్ల ఏపీ ప్రజలకు ప్రయోజనం శూన్యమన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. సో మరి ఎపి ప్రయోజనాల పరిరక్షణకు బాబు ఏం చేయబోతారన్నది చూడాలి.