చంద్రన్న కానుకలన్నీ నాసిరకమేనా? ఆర్భాటంగా క్రిస్మస్, సంక్రాంతికి అందిస్తున్న చంద్రన్న కానుకలు ఎందుకూ పనికిరావని తేలిపోయింది. తియ్యగా ఉండాల్సిన బెల్లం... పుల్లగా మారింది. గోధుమ పిండి కూడా అంతే. దీంతో వీటిని ఎందుకు సరఫరా చేస్తున్నారా? ఇందులో అవినీతి జరిగిందా? అనే చర్చ జరుగుతోంది. క్రిస్మస్, సంక్రాంతి సందర్భంగా పేదలకు ప్రభుత్వం ఉచితంగా ఆరు సరుకులను పంపిణీ చేస్తోంది. వీటిలో గోధుమపిండి, బెల్లం, నెయ్యి, శనగపప్పు, అరలీటరు పామాయిల్ వంటి వాటిని పంపిణీ చేస్తున్నారు. అయితే వీటిలో ఏదీ నాణ్యత ఉన్నట్లు కన్పించడం లేదు. క్రిస్మస్ పండుగకు ఇంకా నాలుగు రోజులే సమయం ఉంది. ఇంకా రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ సరుకులు జిల్లా, మండల, గ్రామ ప్రాంతాలకు చేరలేదు.
నాసిరకంగా....
వాస్తవానికి క్రిస్మస్ కు వారం రోజుల ముందుగానే వీటిని పంపిణి చేయాలి. అయితే కొన్ని చోట్ల నాసిరకం అని తేలడంతో వాటిని ఉన్నతాధికారులు వెనక్కు పంపినట్లు తెలుస్తోంది. బెల్లం మరీ నాసిరకంగా ఉందంటున్నారు. ఏపీలో అనకాపల్లి బెల్లం అంటే ఫేమస్. అయితే దాన్ని కాదని గుజరాత్ నుంచి ప్రత్యేకంగా బెల్లం తెప్పించడం వివాదంగా మారింది. ఈ బెల్లం బూజుపట్టి ఉండటంతో అధికారులే మండిపడుతున్నారు. తమకు బెల్లం బదులు చక్కెర ఇవ్వాలని కొందరు లబ్దిదారులు కోరుతున్నారు. కాని నిబంధనలు అంగీకరించవని అధికారులు చెబుతున్నారు.
ఇతర రాష్ట్రాలకు చెందిన....
ఇక గోధుమ పిండి పరిస్థితి కూడా అంతే. అసలు ఇది గోధుమ పిండేనా? అనిపించే విధంగా ఉంది. ఈ ప్యాకెట్ లో నూక, పొట్టు ఉండటంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ గోధుమ పిండిని ముంబయికి చెందిన ఈటీఎస్ ఆగ్రో ప్రోసెసింగ్ సంస్థ సరఫరా చేస్తోంది. దీనిపై కూడా కొందరు అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. కొందరు అధికారులు నాణ్యత పరీక్ష కోసం ల్యాబ్ కు కూడా పంపారు. ఇక నెయ్యి పరిస్థితి కూడా అంతే. ఆ వాసనేలేదు. నెయ్యిని ఉత్తర ప్రదేశ్ కు చెందిన ప్రయాగ అనే కంపెనీ సరఫరా చేస్తోంది. ఇక శనగపప్పును బెంగళూరుకు చెందిన భాగ్యలక్ష్మి కంపెనీ సరఫరా చేస్తోంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న ఈ సరుకులు నాసిరకంగా ఉండటంతో పండగ రోజుల్లో పేదల ఇళ్లల్లో వెలుగులు నింపాలన్న ముఖ్యమంత్రి ఆలోచన పక్కదారి పట్టేలా ఉంది. దీనిపై కొందరు అధికారులు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయలు చంద్రన్న కానుకల కోసం వెచ్చించినా ఫలితం మాత్రం రావడం లేదు. ఈనెల20 వతేదీ నుంచి కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ కానుకలను లబ్దిదారులకు అందజేస్తున్నారు. అయితే వీటిని అందుకున్న వారు పెదవి విరుస్తున్నారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఇతర రాష్ట్రాల కంపెనీలకు అప్పజెబితే ఇలానే ఉంటుందంటున్నారు ఉన్నతాధికారులు.