చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ కావడంతో చంద్రగిరిలో జగన్ పర్యటన ఎలా సాగుతుందోనన్న ఉత్కంఠ ఇటు టీడీపీ, వైసీపీ నేతల్లో నెలకొంది. అయితే అనూహ్యంగా జగన్ పాదయాత్రకు జనం వచ్చేస్తున్నారు. ఇప్పటికే జగన్ 61 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. కుప్పంబాదూరు నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర వెంట వేలాది మంది జనం నడిచారు. ఒడ్డుకల్వ, సురవారిపల్లి క్రాస్ రోడ్స్, బలిజపల్లి, పీవీపురం, రామిరెడ్డిపల్లి, గంగారెడ్డిపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా కమ్మ కండ్రిగ, రామచంద్రాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి పాత కందలవారి పల్లికి బయలుదేరి అక్కడ జగన్ రాత్రి బస చేశారు.
చంద్రబాబు సొంత ఊళ్లోనే....
రామచంద్రాపురంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై జగన్ నిప్పులు చెరిగారు. తాను పుట్టిన గడ్డకే చంద్రబాబు ఏమీ చేయలేదని విమర్శలు చేశారు. చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గంలోనే పుట్టారని, ఇక్కడి నుంచి 1978లో కాంగ్రెస్ పార్టీ తరుపున రెండువేల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా అయ్యారన్నారు. అయితే అదే చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఐదేళ్ల తర్వాత పోటీలోకి దిగి 17వేల ఓట్లతో చంద్రబాబు ఓడిపోయారన్నారు. విదేశాల్లో ఉన్న ఎన్నారైలు సయితం సొంతగడ్డ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటుంటే.. ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు సొంతగడ్డ చంద్రగిరికి ఏమీ చేయాలేదని ఎద్దేవా చేశారు.
తాగేందుకు నీరేదీ?
చంద్రబాబు సొంత గ్రామమైన నారావారి పల్లి పక్కనే ఉన్న శేషాపురంలో ఆయన చదువుకున్నారని, శేషాపురంలో ఉన్న స్కూలును కూడా చంద్రబాబు పట్టించుకోక పోవడం ఆయన పనితీరుకు అద్దం పడుతుందన్నారు. ఆ స్కూలు ఎప్పుడు కూలిపోతుందోనన్న స్థితిలో ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చదువుకున్న స్కూలు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగిలిన స్కూళ్ల పరిస్థితి ఏంటో తాను చెప్పక్కర్లేదన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 138 పంచాయతీల్లో తాగునీటి ఎద్దడికి ఎవరు కారణమని ప్రశ్నించారు. ఏనుగులు వచ్చి ప్రతి ఏడాది రైతులు పంటను కోల్పోతున్నా చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. రామచంద్రాపురంలో జరిగిన బహిరంగ సభకు జనం అధిక సంఖ్యలో హాజరయ్యారు.