గోవా దెబ్బకు కాంగ్రెస్ కు తెలిసొచ్చినట్లుంది. మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 28 స్థానాల్లోనూ, ఎన్.పి.పి 14 స్థానాల్లోనూ, ఇతరులు 10 స్థానాల్లోనూ, బీజేపీ 7 స్థానాల్లోనూ ముందంజలో ఉన్నాయి. అయితే ఇటీవల జరిగిన గోవా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అక్కడ అధికారాన్ని బీజేపీ చేపట్టిన సంగతి తెలిసిందే. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి ఆ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ కారణమని గోవా కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆయనను ఇన్ ఛార్జి బాధ్యతలనుంచి కూడా తప్పించారు.గోవా విషయంలో కాంగ్రెస్ న్యాయస్థానానికి వెళ్లినా ఫలితం లేకుండాపోయింది. అయితే ఈసారి అలాంటి తప్పు మేఘాలయలో జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ ముందుజాగ్రత్తలు తీసుకుంది. ఆధిక్యంలో ఉందని తెలియగానే మేఘాలయకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, కమల్ నాధ్ లు మేఘాలయ బయలుదేరి వెళ్లారు. పార్టీ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేలా చూడటం, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోకుంటే ఇతర పార్టీలను, స్వతంత్రులను ఒప్పించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వీరిద్దరూ మేఘాలయకు వెళ్లారు. గోవా ఎన్నికల నుంచి గుణపాఠం నేర్చుకున్న కాంగ్రెస్ మేఘాలయలో రిపీట్ కాకుండా ఉండేందుకు సీనియర్ నేతలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ అక్కడకు పంపడం విశేషం.