సైబరాబాద్ పరిధిలో వరుసగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ అటు ప్రజలు, ఇటు పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర గొలుసు దొంగ (ఇంటర్ స్టేట్ చైన్ స్నాచర్)ను సైబరాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు. వరుస గొలుసు చోరీలకు పాల్పడుతున్న అమోల్ బాబా సాహెబ్ షిండే నుంచి 47 తులాల బంగారం, ఒక మోటార్ సైకిల్ ను, మొత్తం 15 లక్షలు విలువ చేసే సొత్తును పోలీసులు స్వాధ్వీనం చేసుకున్నారు. ఇతను సైబరాబాద్ పరిధిలోని కూకట్ పల్లి, చందానగర్, కేపిహెచ్‌బిలలో మొత్తం 18 స్నాచింగ్ లు చేశాడు. కాలనీల్లో ఒంటరిగా మహిళలు బయటకి రావాలంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. అమోల్ బాబా సాహెబ్ షిండేను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు ప్రజల్లో భరోసాను, పోలీసులంటే నమ్మకాన్ని కల్పించగలిగారు.
వివరాల్లోకి వెళ్తే.....
మహారాష్ట్రలోని పర్భానీ జిల్లా ఖానాపూర్ తాలూకా యశ్వంత్ నగర్ కు చెందిన అమోల్ బాబా సాహెబ్ షిండే అలియాస్ అమోల్ (24), డ్రైవరు గా పని చేస్తున్నాడు. అమోల్ తండ్రి పేరు బాల సాహెబ్. అమోల్ షిండే పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని ముగ్గురు తోబుట్టువులు జీవితంలో స్థిరపడ్డారు. అమోల్ బాబా సాహెబ్ షిండే కుటుంబం తో సహా మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో లో ఉంటున్నాడు. దూరాలవాట్లు, వ్యసనాలు, చెడు స్నేహాల కారణంగా అమోల్ బాబా సాహెబ్ షిండే దారి తప్పాడు. విలాసవంతమైన జీవితం, జల్సాల కోసం ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలని (ఈజీ మనీ) కోసం దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
గతమంతా నేర చరిత్రే.. మారని బుద్ధి.....
2013 సంవత్సరంలో మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్ళినప్పటికీ అమోల్ బాబా సాహెబ్ షిండే బుద్ధి మారలేదు. 2014 సంవత్సరంలో జైలు నుంచి విడుదలయ్యాక ఔరంగాబాద్ కు మకాం మార్చాడు. అక్కడ వరుసగా నాలుగు స్నాచింగ్ లకు పాల్పడి అరెస్టు అయ్యాడు. అదే సంవత్సరం జైల్ నుంచి విడుదలయ్యాడు. కొంత విరామం తర్వాత 2016 సంవత్సరంలో మహారాష్ట్రలోని లాతూర్ లో 5 స్నాచింగ్ లు చేసి లాతూర్ పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్ళాడు.
జైల్లోనే వ్యూహం, ప్రణాళిక రచన....
లాతూర్ జైల్ లో ఉన్న సమయంలోనే అమోల్ బాబా సాహెబ్ షిండే కు సంజయ్ హకాని యాదవ్ తో పరిచయం ఏర్పదిండి. వీరిద్దరి పరిచయం కారణంగా ‘తెలుగు వారు ఎక్కువగా నగలు ధరిస్తార’ని సంజయ్ హకాని ద్వారా అమోల్ తెలుసుకున్నాడు. దీంతో హైదరబాద్ వైపు అమోల్ చూపు పడింది. ఇక్కడ నేరాలు చేయాలని అమోల్ బాబా నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా జైల్ నుంచి విడుదలయ్యాక తన స్నేహితుడైన అనిల్ పేరు మీద అమోల్ బజాజ్ డిస్కవర్ మోటార్ సైకిల్ ను (NO. MH-22-Y-9972) కొనుగోలు చేశాడు. కొన్ని నేరాలు చేసిన అనతరం ఇతను తన బైక్ ను మార్చి MH22AE 0902 యమహా బండి (ఎరుపు రంగు సీట) ని కొనుగోలు చేసి నేరాలకు పాల్పడ్డాడు.
సైబరాబాద్ లో నేరాల పంథా ఎలా.....
అమోల్ బాబా సాహెబ్ షిండే చైన్ స్నాచింగ్ ల నిమిత్తం గత సంవత్సరం ఆగస్టు నెలలో పర్భానీ నుంచి హైదరబాద్ వచ్చాడు. మియాపూర్ లో రెండు, చందా నగర్ లో 1, కేపిహెచ్‌బి లో 1 స్నాచింగ్ చేశాడు. మొత్తం చందానగర్, మియాపూర్ కేపిహెచ్‌బిలో ఇతను 17 స్నాచింగ్ లు చేశాడు.
ఒకే తరహా నేరాలు....
స్నాచింగ్ చేయాలనుకున్న ప్రాంతంలో అమోల్ బాబా సాహెబ్ షిండే ముందుగా రెక్కీ నిర్వహిస్తాడు. ఎక్కువగా నిర్మానుష్య ప్రాంతాలు, మహిళలు, వృద్ధులు తిరిగే ప్రాంతాలను టార్గెట్ గా ఎంచుకుంటాడు. ఒంటరిగా మహిళలు గుడికి, షాపులకు, మార్కెట్ కి వెళ్ళే సమయంలో వారికి ఎదురుగా వచ్చి ఎడమ చేత్తో చైన్ స్నాచింగ్ చేస్తాడు.
పోలీసుల నిర్విరామ కృషి.....
వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కక్కుండా తిరుగుతున్న ఈ గొలుసు దొంగ కారణంగా ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో తీవ్ర అభద్రతాభావం, భయాందోళనలు ఏర్పడ్డాయి. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ఛేదించడాన్ని సవాలుగా తీసుకున్నారు. సిసిటివిల ద్వారా నిందితుడి చిత్రాన్ని సేకరించిన పోలీసులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా లో విస్తృతంగా ప్రచారం కల్పించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కేపిహెచ్‌బి పోలీసులు కేపిహెచ్‌బి లోని ఓ లాడ్జిలో చైన్ స్నాచర్ అమోల్ బాబా సాహెబ్ షిండేను పట్టుకున్నారు. దర్యాప్తులో అతను తన నేరాలను అంగీకరించాడు. అయితే అమోల్ బాబా సాహెబ్ షిండే వద్ద నుంచి ఇంకా మిగిలిన సొత్తు రికవరీ చేయాల్సి ఉంది.