గొట్టిపాటికి ఆయనే ధీటైన అభ్యర్ధా?

Update: 2018-03-06 01:30 GMT

అద్దంకి నియోజకవర్గంలో పర్యటిస్తున్న జగన్ పాత లెక్కలను తీసినట్లు కన్పిస్తోంది. ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటీ రవికుమార్ వైసీపీ గుర్తు మీద గెలిచి టీడీపీలోకి మారారు. దీంతో అద్దంకి అనాధలా మారకూడదని భావించిన జగన్ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యను లైమ్ లైట్ లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లుంది. జగన్ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో జరగుతుంది. జగన్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య వెన్నంటే ఉండటం కన్పిస్తుంది. అద్దంకి నియోజకవర్గం టిక్కెట్ గరటయ్యకే ఇస్తారన్న టాక్ పార్టీలో బలంగా విన్పిస్తోంది.

నాలుగు సార్లు విజయం....

బాచిన చెంచుగరటయ్య అద్దంకి నియోజకవర్గానికి సుపరిచితుడు. ఇప్పటికి నాలుగుసార్లు అద్దంకి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1983లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసిన గరటయ్య తన ప్రత్యర్థి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తిపై ఐదు వేల ఓట్లతేడాతో విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు గెలిచిన గరటయ్య తర్వాత టీడీపీలో చేరారు. 1985లో కాంగ్రెస్ అభ్యర్థి జాగర్లమూడి హనుమయ్య పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా అద్దంకి నుంచి గెలుపొందారు. 1994లో టిక్కెట్ దక్కకపోవడంతో తిరిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జాగర్లమూడి రాఘవరావుపై విజయం సాధించారు. తర్వాత తిరిగి 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గరటయ్య కాంగ్రెస్ అభ్యర్థి జాగర్లమూడి రాఘవరావుపై గెలుపొందారు. డాక్టర్ గా అందరికీ సుపరిచితుడైన గరటయ్యను తిరిగి అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నిలబెడతారన్న ప్రచారం ఆ నియోజకవర్గంలో జరుగుతుంది.

గట్టిపోటీ తప్పదా?

ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టి పాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం ల మధ్య సఖ్యత లేకపోవడంతో అద్దంకిని గరటయ్య అయితే సులువుగా గెలుచుకుంటారని వైసీపీ భావిస్తోంది. అయితే దీనిపై జగన్ ఎలాంటి నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ అద్దంకి నియోజకవర్గంలో జరుగుతున్న్ పాదయాత్రను పరిశీలిస్తే గరటయ్య కు గ్యారంటీ అన్న టాక్ విన్పిస్తోంది. గొట్టిపాటిని గరటయ్య ఒక్కరే గట్టిగా ఢీకొట్టగలరన్న అభిప్రాయాన్ని చాలా మంది వైసీపీ నేతలు కూడా వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అయితే గొట్టిపాటి ఫ్యామిలీ నుంచి కూడా కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నట్లుతెలుస్తోంది.

జగన్ @ 1400....

జగన్ పాదయాత్ర అద్దంకి నియోజకవర్గంలో 1400 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. అద్దంకి నియోజకవర్గంలోని నాగులపాడులో యాత్ర 1400 కిలోమీటర్లు దాటిన సందర్భంగా జగన్ అక్కడ మొక్క నాటారు. అద్దంకి నియోజకవర్గంలోనూ జగన్ పాదయాత్రకు మంచి స్పందన కన్పిస్తుండటంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కన్పిస్తోంది. పార్టీ నేతలంతా హాజరై జగన్ పాదయాత్రను విజయవంతం చేయడానికి కృషి చేశారు.జగన్ పాదయాత్ర 105వ రోజుకు చేరుకుంది. ఈరోజు ఉదయం తక్కెళ్లపాడు శివారునుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచిజె.పంగులూరు, అరికట్లవారి పాలెం, గంగవరం మీదుగా ఇంకొల్లు వరకూ యాత్ర కొనసాగుతుందని వైసీపీ ఒక ప్రకటనలో పేర్కొంది.

Similar News