తమిళనాట చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా అన్నాడీఎంకేకే ఈ సమస్య ఏర్పడింది. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నాయి. ఒకటి పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గం కాగా, రెండోది శశికళ వర్గం. అన్నాడీఎంకేతో సంబంధం లేకున్నా మూడో వర్గంగా జయలలిత మేనకోడలుదీప ఉన్నారు. ఈ మూడు వర్గాలు ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తలపడనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 21న పోలింగ్ గా నిర్ణయించింది. డిసెంబర్ 24వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడటంతో అధికార అన్నాడీఎంకే పార్టీలో అలజడి మొదలయింది. ప్రధానంగా రెండు వర్గాలకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారనుంది. ముఖ్యంగా శశికళకు, పన్నీర్ సెల్వం, పళనిస్వామిలకు ఈ ఎన్నికల్లో గెలుపోటములే వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
చావో...రేవోనంటున్న రెండు వర్గాలు....
అయితే ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో జయలలిత మేనకోడలు దీప, శశికళ మేనల్లుడు దినకరన్ లు పోటీ చేయడం దాదాపు ఖరారయింది. ఇక అన్నాడీఎంకే పళనిస్వామి వర్గం నుంచి అభ్యర్థిని ఖారారు చేయాల్సి ఉంది. అయితే ఇటీవలే పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలకు అన్నాడీఎంకే కు చెందిన రెండాకులు గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించడంతో వారికి చాలా ఊరటనే చెప్పాలి. ఎందుకంటే రెండాకుల గుర్తు సెంటిమెంట్ ఆర్కేనగర్ లో బలంగా పనిచేస్తోంది. ఆర్కే నగర్ లో ఓటమి పాలయితే పళనిస్వామి కుర్చీకే ఎసరు వస్తుంది. ఇందుకోస పళనిస్వామి ఈ ఎన్నికలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నం చేస్తారు. ఇక దినకరన్ కు కూడా ఈ ఎన్నిక చావోరేవో కానుంది. శశికళ ఇప్పటికే అనేక కేసుల్లో చిక్కుకుని ఉన్నారు. ఐటీ దాడులతో సతమతమయి పోయారు. పార్టీ గుర్తు కూడా చేజారిపోయింది. ఈ ఎన్నికలో ఓటమి పాలయితే ఇక రాజకీయంగా శశికళ బ్యాచ్ కు భవిష్యత్ ఉండనట్లే. గెలిస్తే మాత్రం తిరిగి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుు కోవచ్చన్నది శశికళ వర్గం ఆలోచన. మొత్తం మీద ఈ ఎన్నిక వీరి రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించనుంది.