గుత్తా రాజీనామాపై కేసీఆర్ నిర్ణయమిదేనా?

Update: 2017-10-13 10:30 GMT

నల్లగొండ ఉప ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియదు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తారో కూడా ఇంతవరకూ క్లారిటీ లేదు. అయితే అన్ని పక్షాలు మాత్రం ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి. అభ్యర్థులెవరైతే బాగుంటుందనే సమీక్షలు నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇంతవరకూ నల్లగొండ పార్లమెంటు ఉప ఎన్నికలపై ఎవరూ స్పందించడం లేదు. పార్టీ అధినేత ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదు. ఈ వారంలో గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామా చేస్తారని మాత్రం టీఆర్ఎస్ లో బలంగా ప్రచారం జరుగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్ గా నియమించిన అనంతరం గుత్తా తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుత్తాకు సంకేతాలు కూడా ఇచ్చారట. అయితే రాజీనామాకంటే ముందుగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రకటించిన తర్వాతనే గుత్తా రాజీనామా చేయనున్నారు. గుత్తా రాజీనామా చేసినా ఉప ఎన్నికలు నిర్వహిస్తారన్న గ్యారంటీ లేదు. రాజీనామా చేసిన ఆరు నెలల్లోపు ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే లోక్ సభ ఎన్నికలు ముందుగానే వస్తాయనుకుంటున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక జరుగుతుందన్న గ్యారంటీ కూడా లేదన్నది ఒక అంశం.

టీఆర్ఎస్ అభ్యర్థి కోసం.....

అయితే పరిస్థితి ఇలా ఉంటే... టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. గుత్తా సోదరుడు జితేందర్ రెడ్డి పేరు నిన్నమొన్నటి వరకూ విన్పించింది. అయితే తాజాగా కంచర్ల భూపాల్ రెడ్డి పేరు కూడా బలంగా విన్పిస్తోంది. కంచర్ల భూపాల్ రెడ్డి నల్లగొండ జిల్లా తెలుగుదేశం నేత. నల్లగొండ ఎమ్మెల్యే టిక్కెట్ పై రెండు సార్లు పోటీ చేసిన కంచర్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆయనకు జిల్లాలో క్లీన్ ఇమేజ్ ఉండటంతో కేసీఆర్ ఆయనవైపు మొగ్గు చూపుతున్నారని గులాబీ పార్టీలో టాక్ విన్పిస్తోంది. ఇప్పటి వరకూ టీడీపీ లో ఉన్న నేత టీఆర్ఎస్ లోకి రావాలని కొందరు నేతలు ఆయన వద్దకు వెళ్లినట్లు కూడా సమాచారం. అయితే నల్లగొండ ఉప ఎన్నిక జరిగి... అందులో టీడీపీ తరుపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీకి దిగితే తాను పోటీ చేయబోనని కంచర్ల స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డికి కంచర్ల అత్యంత సన్నిహితుడు. అయితే కంచర్ల ప్రతిపాదనను స్థానిక నేతలు అధినేతకు వద్దకు తీసుకెళ్లారట. గులాబీ బాస్ చిరునవ్వి ఊరుకున్నారట. మొత్తం మీద ఉప ఎన్నిక జరుగుతుందో లేదో తెలియదు కాని అభ్యర్థుల వేట మాత్రం అన్ని పార్టీల్లో కొనసాగుతూనే ఉంది.

Similar News