గుజ‌రాత్ బీజేపీ ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్‌... !

Update: 2017-11-18 06:30 GMT

దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేపుతోన్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ విడుద‌ల చేసింది. గుజ‌రాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గ‌త 22 ఏళ్లుగా గుజ‌రాత్‌ను బీజేపీ అప్రతిహ‌తంగా పాలిస్తోంది. ఎలాగైనా ఈ సారి గుజ‌రాత్‌లో బీజేపీని గ‌ద్దె దించాల‌ని కాంగ్రెస్ ప్రయ‌త్నిస్తుంటే, మ‌రో ఐదేళ్లపాటు త‌న పాల‌న‌ను రెన్యువ‌ల్ చేసుకోవాల‌ని బీజేపీ ప్రయ‌త్నాల్లో ఉంది. గుజ‌రాత్ ఎన్నిక‌లు డిసెంబ‌ర్ 9, 14వ తేదీల్లో జ‌ర‌గ‌నున్నాయి. 18న ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.

హోరాహోరీ ప్రచారం....

ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ నేత‌లు హోరాహోరీగా ఎన్నిక‌ల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్ ఉద్యమాలు, హార్దిక్ ప‌టేల్‌తో పాటు మ‌రో ముగ్గురు ఉద్యమ‌నేత‌లు కాంగ్రెస్‌కు మ‌ద్దతు ఇవ్వడంతో ఈ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్తరంగా మారాయి. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ ఎన్నిక‌ల ప్రచారంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక హార్దిక్ కూడా రాహుల్‌కు తోడ‌య్యాడు. బీజేపీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ప్రధానమంత్రి న‌రేంద్రమోడీ ఈ నెల 18 నుంచి ఎన్నిక‌ల ప్రచారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

70 మంది జాబితా విడుదల....

ఇక బీజేపీ తాజాగా 70 మంది పేర్లతో కూడిన తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ, ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ పేర్లు ఉన్నాయి. కీలకమైన పశ్చిమ రాజ్‌కోట్‌ నుంచి సీఎం విజ‌య్‌ రూపానీ పోటీ చేస్తున్నారు. జైన్ మతానికి చెందిన విజయ్ రూపాని బీజేపీ గుజరాత్ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. విజయ్ రూపాని ఎంపీగాను సేవలందించారు.కాగా నితిన్‌ పటేల్‌ మెహసన నియోజకవర్గం నుంచి బ‌రిలో ఉన్నారు. గుజరాత్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జీతు వాఘాని భావనగర్‌ వెస్ట్‌ నుంచి బరిలోకి దిగుతున్నారు.

మరో జాబితా త్వరలోనే....

ఇటీవ‌ల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే రాఘవ్‌జీ పటేల్‌కు బీజేపీ కీల‌క‌మైన‌ జామ్‌నగర్‌ టికెట్‌ ఇచ్చింది. ఇంకా మరో ఇద్దరు కాంగ్రెస్‌ మాజీ నేతలు రమ్నీష్‌ పర్మార్‌, సీకే రావుల్జీకి కూడా బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. మిగతా 112 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీకి 121 మంది శాసన సభ్యులు ఉన్నారు. వారిలో 35 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మళ్లీ పోటీ చెయ్యడానికి అవకాశం కల్పించడానికి అధిష్టానం నిరాకరించింది. అంతే కాకుండా 6 మంది మంత్రులు మళ్లీ పోటీ చెయ్యడానికి అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. రెండో జాబితా కూడా రిలీజ్ చేస్తే చాలా మందికి షాకులు త‌ప్పవు.

Similar News