గుజరాత్ లో గెలుపెవరిదంటే...?

Update: 2017-12-18 00:30 GMT

మరికొద్ది సేపట్లో గుజరాత్ కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. మొత్తం 182 శాసనసభ నియోజకవర్గాలకు రెండు దశల్లో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈరోజు కౌంటింగ్ ప్రారంభం కానుండంటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గుజరాత్ ఎన్నికలు కేవలం భారత్ కాదు ప్రపంచ దేశాల దృష్టినీ ఆకర్షించాయి. ఇక్కడ మోడీకి విజయం చేకూరుతుందా? లేక అవమానం మిగులుతుందా? అని అంతర్జాతీయ సమాజం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. మొత్తం 182 స్థానాలకు జరిగిన ఎన్నికలలో 92 స్థానాలు దక్కితే అధికారం చేజిక్కినట్లే. 92 స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తలపడ్డాయి. ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఇద్దరూ వీధివీధి తిరిగి ప్రచారం చేశారు. ఈ ఎన్నికలు వీరిద్దరికీ సవాలుగా మారాయి.

బీజేపీకే అవకాశాలంటూ....

ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కాంగ్రెస్ కు ఆశాభంగం కల్గించాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలు బీజేపీకి అనుకూలంగా ఫలితాలొస్తాయని చెప్పాయి. అయితే ఈసారి కొంత మెజారిటీ బీజేపీకి తగ్గే అవకాశముందని తేల్చాయి. కాంగ్రెస్ పూర్వం కంటే గుజరాత్ లో బలం పెంచుకుంటుందని కూడా చెప్పాయి. మొత్తం మీద మరికాసేపట్లో ప్రారంభం కానున్న కౌంటింగ్ ను దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇదిలా ఉంటే పాటీదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్థిక్ పటేల్ ఈవీఎంలు ట్యాంపరింగ్ కు గురయినట్లు ఆరోపణలు చేయడం సంచలనం కల్గించింది. ఏటీఎంలనే హ్యాక్ చేసినప్పుడు ఈవీఎంలను చేయడం ఎంత పని అని ఆయన ప్రశ్నించారు. 500 ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసేందుకు 140 మంది ఇంజినీర్లను అద్దెకు తెచ్చారని హార్థిక్ పటేల్ ఆరోపించడం చూస్తుంటే కాంగ్రెస్ కు విజయావకాశాలు తక్కువగానే ఉన్నాయని అర్థమవుతోంది. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.

Similar News