గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసి వస్తుందనుకుంటే...ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఎన్సీపీ తొలి నుంచి కాంగ్రెస్ కు మిత్రపక్షంగానే ఉంటూ వస్తోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ యూపీఏ పదేళ్ల హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ ఉన్న బంధాన్ని గుజరాత్ ఎన్నికల్లో తెంచుకునేందుకే ఎన్సీపీ సిద్ధమయింది. తాము ఒంటరిగానే గుజరాత్ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ఎన్సీపీ ఈరోజు ప్రకటించింది. అయితే తొలి నుంచి కాంగ్రెస్ తో కలిసి వెళ్లాలనే ఎన్సీపీ భావించింది. అందుకు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరపాల్సిందిగా ఆ పార్టీ కాంగ్రెస్ ను కోరింది. అయితే ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఎటువంటి నిర్ణయం తీసుకోక పోవడం వల్లనే ఒంటరి పోరుకు సిద్ధమైనట్లు ఎన్సీపీ నే ప్రపుల్ పటేల్ తెలిపారు.
సీట్ల సర్దుబాటు చేయలేకనే....
కాంగ్రెస్ కు సీట్ల సర్దుబాటు కష్టంగా మారింది. కాంగ్రెస్ కు మద్దతిచ్చిన పటేదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ తమ సామాజిక వర్గానికి 30 సీట్లు కోరుతున్నారు. గత ఇరవై ఏళ్ల నుంచి అధికారానికి దూరంగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ గుజరాత్ లో ఆ పార్టీకి నేతలకు కొదవలేదు. ప్రతి నియోజకవర్గంలో టిక్కెట్ ఆశించే నేత ఉన్నారు. దీంతో కాంగ్రెస్ టిక్కెట్లకు ఈ సారి బాగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ పదుల సంఖ్యలో సీట్లు అడుగుతుండటంతో కాంగ్రెస్ పార్టీ అయోమయంలోపడింది. ఎక్కువ సీట్లు ఇస్తే సొంత పార్టీలో అసంతృప్తి పెరిగే అవకాశముందని భావించిన కాంగ్రెస్ అధిష్టానం సీట్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో 77 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది.