గుజరాత్ ఎన్నికల్లో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ తలపడుతున్నాయి. ముఖ్యంగా పటేళ్ల రిజర్వేషన్ వ్యవహారం రెండు పార్టీలకు ఇబ్బందిగా మారింది. అయితే పటేళ్ల రిజర్వేషన్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్ గజ దొంగ కంటే దొంగకే మద్దతివ్వడం మేలని చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఊరట నిచ్చాయి. అయితే అది ఎంతసేపో నిలవలేదు. పటేళ్ల రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసిన తర్వాతే ముందుకు వెళతామని హార్థిక్ పటేల్ అల్టిమేటం ఇచ్చారు. అందుకు డెడ్ లైన్ కూడా విధించారు. డిసెంబర్ 3వ తేదీలోగా పటేళ్ల రిజర్వేషన్ స్పష్టమైన హామీని కాంగ్రెస్ ఇవ్వకుంటే బీజేపీ ఎదుర్కొన్న పరిస్థితినే ఎదుర్కొనాల్సి ఉంటుందని హార్థిక్ పటేల్ హెచ్చరించారు.
హార్థిక్ పటేల్ అల్టిమేటంతో.....
గుజరాత్ లో పటేళ్ల సమాజిక వర్గం బలంగా ఉంది. దీనికంటే ఎక్కువగా ఓబీసీ ఓటు బ్యాంకు ఉంది. పటేళ్లు 14 శాత ఓటర్లు ఉంటే, ఓబీసీలు దాదాపు 29 శాతం మంది ఉన్నారు. పటేళ్ల రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీని ఇస్తే ఓబీసీలు దూరమయ్యే అవకాశముంది. ఇప్పుడు హార్థిక్ పటేల్ హెచ్చరికలతో కాంగ్రెస్ పరిస్థితి కక్కలేక... మింగలేక అన్నట్లు తయారైంది. మరోవైపు పటేళ్లు అడుగడుగునా అడ్డుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అమిత్ షా సభలన అనేకసార్లు పటేల్ సామాజిక వర్గానికి చెందిన నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి హార్థిక్ పటేల్ విధించిన డెడ్ లైన్ సంకటంగా మారింది. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు హార్థిక్ పటేల్ తో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. తాము పటేళ్ల రిజర్వేషన్ కు వ్యతిరేకం కాదని, అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లు అమలు చేస్తామని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద హార్థిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల సమయంలో ఇరకాటంలో పడేశారు.