గుజరాత్ లో ఏమైనా జరగచ్చు. ఇరవై ఏళ్లు అధికారంలో ఉన్న కమలం పార్టీకి చుక్కెదురూ కావచ్చు. లేదంటే బొటాబొటి మెజారిటీతో విజయం సాధించే అవకాశాలూ ఉన్నాయి. కాని గతంలో ఉన్న పరిస్థితి ఇప్పుడు గుజరాత్ లో బీజేపీకి లేదన్నది యదార్థం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ తన బలం పెంచుకుంటూ పోతోంది. అయితే అది విజయ తీరాల వరకూ ఆ బలం పెరుగుతుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టం కాకున్నా కాంగ్రెస్ మాత్రం గుజరాత్ లో కోలుకున్నదన్నది వాస్తవం. గుజరాత్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఈ నెల 9వ తేదీన జరగనుంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లు హోరాహోరీ ప్రచారం చేశాయి. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 93. 93 స్థానాలు దక్కించుకుంటే మోడీ కోటను కాంగ్రెస్ బద్దలు కొట్టినట్లే. అయితే ఇది సాధ్యమా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. కాని అసాధ్యం మాత్రం కాదన్నది విశ్లేషకుల అంచనా.
పెరుగుతున్న కాంగ్రెస్ బలం....
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న వేళ అనేక సంస్థలు సర్వే నిర్వహించాయి. సర్వేల్లో బీజేపీకే కొంత మొగ్గు కనిపిస్తూ నిన్నమొన్నటి వరకూ వచ్చింది. అయితే తాజాగా జరిపిన సర్వేలో మాత్రం నువ్వా? నేనా? అన్నట్లు ఉందని తేలడంతో బీజేపీలో గెలుపు భయం పట్టుకుందనే చెప్పొచ్చు. గుజరాత్ అంటేనే మోడీ.. మోడీ అంటేనే గుజరాత్. అలాంటి ఎన్నికల్లో ఓటమి పాలు కాకూడదన్న పట్టుదలతో కమలదళం మొత్తం రంగంలోకి దిగింది. అయితే ఈనేపథ్యంలో లోక్ నీతి-సీడీఎస్ సంస్థలు తాజాగా సర్వే నిర్వహించాయి. ఈ సర్వేలో గుజరాత్ లో బీజేపీకి 91 నుంచి 99 సీట్లు వచ్చే అవకాశముందని తేలింది. అలాగే కాంగ్రెస్ కు 78 నుంచి 86 స్థానాలు దక్కవచ్చని స్పష్టమైంది. అయితే ఇదే సంస్థ గత ఆగస్టులో కూడా సర్వేచేసింది. ఆ సర్వేలో మాత్రం బీజేపీకి 150, కాంగ్రెస్ కు 30 స్థానాలు దక్కే అవకాశముందని ప్రకటించింది. తాజా సర్వేకు, గత సర్వేకు చాలా తేడా కన్పిస్తోంది. బీజేపీ కూడా మ్యాజిక్ ఫిగర్ కు అతి దగ్గరలో ఉంది. మరి గుజరాత్ లో ఏమైనా జరగవచ్చు. రాహుల్ కు అదృష్టం కలిసి రావచ్చు. మోడీని దురదృష్టం పట్టినా పట్టొచ్చు. చెప్పలేం. ఇదీ విశ్లేషకుల అంచనా.