గుజరాత్ లో ఏం జరుగుతోంది?

Update: 2017-10-23 16:30 GMT

గుజరాత్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడకపోయినా ఆ రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పుడే మొదలయింది. రాహుల్, మోడీ గుజరాత్ లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు బీజేపీపై ‘కొనుగోళ్ల’ ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో కాంగ్రెస్ పార్టీ సంబర పడిపోతోంది. గుజరాత్ లో ఉన్న పాటేదార్లను తమ పార్టీలోకి రప్పించుకోవడానికి బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాను బీజేపీలో చేరితే కోటి రూపాయలు ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని పటీదార్ ఆందోళన్ సమితి నేత నరేంద్ర పటేల్ ఆరోపించారు. ఇందుకు పది లక్షలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చారని, ఆ డబ్బును మీడియాకు చూపారు. ఈ ఆరోపణ కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. బీజేపీ అధికార దాహంతో పెద్దయెత్తున నేతలను కొనుగోలు చేయాలని చూస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్ విమర్శలను ఖండిస్తోంది. డబ్బు ఇచ్చి పార్టీలోకి తెచ్చుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదని, అభివృద్ధి, మోడీ ఇమేజ్ ను చూసే నేతలు అనేకమంది తమ పార్టీలో చేరుతున్నారని బీజేపీ నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు.

ఎన్నికల కమిషన్ పై సుప్రీంకు.....

దీనిపై రాహుల్ గాంధీ ట్విట్టర్లోనూ స్పందించారు. గుజరాత్ ను ఎవరూ కొనలేరని ఆయన ట్వీట్ చేయడం ప్రచార పర్వాన్ని మరింత వేడెక్కించింది. ఈరోజు రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటించారు. నవసర్జన్ జనాదేశ్ మహాసమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక గుజరాత్ ఎన్నికలకు ఇంతవరకూ నోటిఫికేషన్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేయలేదు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఈసీ గుజరాత్ ఊసు ఎత్తలేదు. దీంతో ఎన్నికల కమిషన్ పై సుప్రీంకోర్టును కాంగ్రెస్ ఆశ్రయించింది. ఈసీపై చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్. కాంగ్రెస్ మీడియా సెల్ ప్రతినిధి, సీనియర్ న్యాయవాది అయిన ప్రకాశ్ జోషి ఎన్నికలసంఘంపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల వేడి జాతీయ పార్టీ రెండింటిలోనూ వేడి పుట్టిస్తోంది.

Similar News