గుజరాత్ లో ఈరోజు తేలిపోతుందా?

Update: 2017-12-09 00:30 GMT

గుజరాత్ ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. గుజరాత్ ఎన్నికల తొలిదశ ఎన్నికలు నేడు జరగనున్నాయి. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా తొలిదశలో 89 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్ లోని సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లో మొదటి దశపోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తొలిదశలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పోటీ చేస్తున్న రాజ్ కోట్ పశ్చిమ నియోజకవర్గం కూడా ఉంది. కీలక నియోజకవర్గం కావడంతో ఈ దశ పోలింగ్ ఆసక్తికరంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిదశలో రెండు కోట్ల 12 లక్షల మంది తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోనున్నారు. మొత్తం 977 మంది అభ్యర్థులు ఈదశలో పోటీ పడుతున్నారు.

సర్వేలు అనుకూలమైనా....

మరోవైపు సర్వేలు బీజేపీకి అనుకూలంగానే వస్తుండటంతో ఆ పార్టీ నేతలు కొంత ఊరట చెందారు. తాజాగా టైమ్స్ నౌ -వీఎంఆర్ ఒపీనియన్ పోల్ నిర్వహించిన సర్వే ప్రకారం బీజేపీకి 106 సీట్లు నుంచి 116 సీట్లు సాధిస్తుందని చెప్పింది. గుజరాత్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 91 సీట్లు అవసరం. ఈ సర్వేలో కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు వస్తాయని తేలింది. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ లో ఎక్కువ స్థానాలను సాధించిన పార్టీయే అధికారంలోకి రావడం సంప్రదాయంగా వస్తుండటతో ఈరోజు జరిగే పోలింగ్ ఉత్కంఠగా మారింది. బీజేపీ సర్వేలు అనుకూలంగానే ఉన్నా టెన్షన్ తప్పడం లేదు. ముఖ్యంగా జీఎస్టీ, నోట్ల రద్దు ప్రభావం చూపిస్తుందేమోనన్న ఆందోళన కమలనాధుల్లో వ్యక్తమవుతోంది. మోడీ ప్రధాని అయ్యాక గుజరాత్ లో తొలిసారి ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధాని మోడీకి ఇది సవాల్ గా మారింది. మరికాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది.

Similar News