బిజెపి, కాంగ్రెస్ పార్టీలు హోరా హోరి పోరాటానికి వేదికగా నిలిచిన గుజరాత్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల్లో 68 శాతం పోలింగ్ నమోదైంది. అక్కడక్కడా చిన్న చిన్న సంఘటనలు మినహా మొత్తం మీద ఎన్నికల తొలిదశ ప్రశాంతం గానే ముగిసింది. 2012 లో జరిగిన గుజరాత్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెండు శాతం ఓటింగ్ తగ్గడం గమనార్హం. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటినుంచి ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. పలు చోట్ల ఈవీఎం లు మొరాయించడంతో రిటర్నింగ్ అధికారులు వాటిని మార్చివేశారు. తాజాగా 89 నియోజకవర్గాల్లో 977 మంది అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ లో భద్రమైంది.
బ్లూ టూత్ టెక్నాలజీతో రిగ్గింగ్ చేశారని కాంగ్రెస్ ఆరోపణ ...
ఈవీఎం లు టాంపరింగ్ చేస్తున్నారంటూ ఆ మధ్య నానా గోలపెట్టిన విపక్షాలు ఆ తరువాత సైలెంట్ అయిపోయాయి. తాజాగా గుజరాత్ ఎన్నికల్లో బ్లూ టూత్ టెక్నలాజితో అధికార బిజెపి రిగ్గింగ్ కి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. దాంతో పలు చోట్ల ఈవీఎంలను అధికారులు మార్చివేశారు .మహాత్మాగాంధీ దండి సత్యాగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన 109 ఏళ్ళ మొత్లీ బా ఈ ఎన్నికల్లో ఓటు వేయడంతో ప్రసారా మాధ్యమాలు ఆమె వెంట పడ్డాయి. సౌరాష్ట్ర , కచ్ ప్రాంతాల్లో బారిపోలింగ్ నమోదు అయ్యింది. ముఖ్యమంత్రి విజయ రూపాణి సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారత క్రికెట్ స్టార్ చటేశ్వర్ పుజారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూరత్ లో భారీ గా ఈవీఎంల మొరాయింపు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక్కడే బ్లూ టూత్ టెక్నాలజీ తో రిగ్గింగ్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. గుజరాత్ లో ఈనెల 14 న రెండోదశ పోలింగ్ జరగనుంది.