గుజరాత్ చివరి దశ టెన్షన్...టెన్షన్...!

Update: 2017-12-11 18:29 GMT

గుజరాత్ చివరి దశ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. మంగళవారంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మొదటి దశ ఎన్నికలు 89 నియోజకవర్గాల్లో ఈనెల 9వ తేదీన జరిగాయి. రెండో దశ ఎన్నికల్లో 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు గుజరాత్ లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. బహిరంగ సభలతో పాటు ఇద్దరూ రోడ్ షోలకు కూడా ప్లాన్ చేసుకున్నారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో ప్రచారం చేయడానికి మంగళవారం అహ్మదాబాద్ కు మోడీ, రాహుల్ రానున్నారు. అయితే ఇద్దరూ అహ్మదాబాద్ లో రోడ్ షో లు ప్లాన్ చేసుకోవడంతో పోలీసులు ఇద్దరికీ అనుమతి నిరాకరించారు.

రోడ్ షోలకు అనుమతి నిరాకరణ....

రోడ్ షో ల వల్ల భద్రతపరమైన సమస్యలు తలెత్తే అవకాశముందని నిఘా వర్గాలు అంచనా వేశాయి. చివరి దశ ఎన్నికలు కావడం, ఎన్నిక ప్రచారానికి చివరి తేదీ కావడంతో అసాంఘిక శక్తులు హెచ్చరిల్లే అవకాశముందని నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్ షోలతో ప్రజలు కూడా ఇబ్బంది పడతారని పోలీసులు చెబుతున్నారు. చివరి దశ ఎన్నికలై బీజేపీ ఆశలు పెట్టుకుంది. తొలిదశలో కూడా తమకు అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు రెండూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో ప్రధాని మోడీ రెండో దశ పోలింగ్ పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందుకోసం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మరో వైపు గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటుందన్న ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యలను పాక్ ఖండించింది. భారత్ ఎన్నికల్లోకి తమను లాగొద్దని, కల్పితమైన కథలను చెప్పి ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించవద్దని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ట్విట్టర్లో కోరారు. దీనిపై కాంగ్రెస్ కూడా మండిపడింది. గుజరాత్ లో ఓట్లకోసమే ప్రధాని తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంది. రెండేళ్ల క్రితం ప్రధాని మోడీ అర్ధాంతరంగా పాక్ కు వెళ్లి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో పెళ్లికి హాజరయ్యారో చెప్పాలని కాంగ్రెస్ కోరింది.

Similar News