వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో ముగిసింది. గుంటూరు జిల్లాలోకి ప్రజాసంకల్ప పాదయాత్ర ప్రవేశించింది. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించింది. ప్రకాశం జిల్లాలో పాదయాత్ర విజయవంతంగా ముగియడంతో గుంటూరు జిల్లా నేతలు కూడా జగన్ పాదయాత్రను సక్సెస్ చేసేందుకు సిద్ధమయ్యారు. గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో పార్టీ పెద్దగా విజయాలు సాధించలేదు. దీంతో గుంటూరుపై ఈసారి జగన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే జగన్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసుకున్నారు.
వైసీపీకి పట్టున్న ప్రాంతాల్లో.....
ఇప్పటికే జగన్ రెడ్డి 1500 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం తొలి నుంచి కాంగ్రెస్, టీడీపీలకు అండగా ఉండేది. 1955లో బాపట్ల నియోజకవర్గం ఏర్పడింది. గుంటూరు జిల్లాలో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కోన రఘుపతి తన సమీప టీడీపీ అభ్యర్థి అన్నం సతీష్ ప్రభాకర్ పై ఆరు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడి నుంచి గాదె వెంకటరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో బాపట్ల నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో.....
ఈసారి కూడా వైసీపీ బాపట్లను కైవసం చేసుకోవాలని శ్రమిస్తోంది. జగన్ పాదయాత్ర ఇప్పటికే వెదుళ్లపల్లి, కుక్కలవారిపాలెం, దరివాద కొత్తపాలెం మీదుగా బాపట్ల చేరుకున్నారు. ఈరోజు ఉదయం చిన్నగొల్లపాలెం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో జగన్ పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం మూర్తి రక్షణనగర్ మీదుగా ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనానికి అప్పికట్లలో ఆగుతారు. తర్వాత ఈతేరు, చుండూరుపల్లి మీదుగా పొన్నూరు చేరుకంటారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైసీపీ నేతలందరూ జగన్ పాదయాత్రకు హాజరయ్యారు.