గాలికి పెద్ద చిక్కొచ్చిపడిందే...!

Update: 2017-10-28 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాలోని నగరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ నేత రోజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రోజా స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై గెలుపొందారు. గాలి ముద్దు కృష్ణమనాయుడిని నగరి ఇన్ ఛార్జిగా చంద్రబాబు నియమించారు. గాలికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. అయితే గత కొంతకాలంగా నగరి నియోజకవర్గంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు కుమారులు భాను, జగదీష్ లు ఇద్దరూ పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గాలి ముద్దు కృష్ణమ నాయుడు పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. వయసు మీద పడటంతో పాటు పార్టీలో తనకు లభించని గౌరవం పై కూడా గాలి కినుక వహించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తన కుటుంబసభ్యులతో గాలి చెప్పేశారు.

రాజీ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో....

ఈ నేపథ్యంలో గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారులిద్దరూ నగరి నియోజకవర్గంపైనే కాన్సన్ ట్రేట్ చేశారు. నిత్యం ప్రజలకు ఇద్దరూ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాసమస్యలపై ఇద్దరూ స్పందిస్తున్న తీరు బాగుందన్న ప్రశంసలు అందుతున్నాయి. అయితే ఇద్దరూ సీటు తమకే కావాలని పట్టుబడుతుండటంతో గాలి ముద్దు కృష్ణమకు ఇంటి సమస్య తీవ్రమయింది. ఇటీవల కుమారులిద్దరినీ పిలిచి రాజీ చేసేందుకు ప్రయత్నించినా... ఇద్దరూ ఎవరికి వారే తామే పోటీ చేస్తామని స్పష్టం చేయడంతో గాలి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి కేరళకు చెందిన సినీ నటి వాణి విశ్వనాధ్ కూడా నగరి నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గాలి కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలు వాణికి అనుకూలిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఒకే కుటుంబంలో ఇద్దరూ టిక్కెట్ కోసం పోటీ పడుతుండటంతో సీనియర్ నేతకు పెద్ద చిక్కే వచ్చిపడట్లయింది. అయితే గాలి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఇద్దరూ కలిసి పనిచేయాలని మాత్రం చెప్పారట. మొత్తం మీద గాలి కుటుంబంలో టిక్కెట్ కోసం విభేదాలు తలెత్తడంతో నగరి నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా నియోజకవర్గాన్ని విడవకుండా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గాలి కుటుంబాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.

Similar News