తెలంగాణ ముఖ్యమంత్రి పేరు ఇక కాళేశ్వరం చంద్రశేఖర రావు. మంత్రి హరీష్ రావు పేరు కాళేశ్వర రావు. ఇలా వారి పేర్లు మార్చి నామకరణాలు చేసింది సాక్షాత్తు ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్. ఆయన అలా ఎందుకు మార్చేశారు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనే కారణం. ఆ ప్రాజెక్ట్ ను టి సర్కార్ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు తో సందర్శించారు నరసింహన్. ప్రాజెక్ట్ నిర్మాణ తీరు అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరునెలల్లో ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగారా అంటే లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు ఆకాశానికి ఎత్తేస్తూ, హరీష్ రావు కు మంచి మార్కులు వేస్తూ వారిద్దరికీ కొత్త పేర్లతో ఇకపై పిలుస్తా అని ప్రకటించారు. సీఎం పేరు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కానీ కాళేశ్వరం చంద్రశేఖర రావు అనే పిలుస్తా అని హరీష్ ను కాళేశ్వర రావు అనే పిలుస్తా అంటూ ఆక్శ్చర్య పరిచారు.
కాళేశ్వరానికి ఇకపై గవర్నరే బ్రాండ్ అంబాసిడర్ ....
ఈ స్థాయిలో కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ గతంలో ఎప్పుడు ప్రశంసించలేదు. చరిత్రలో హరీష్ కాళేశ్వర రావు గా నిలిచిపోతారని దీవించారు. ఈ వ్యాఖ్యలు గులాబీ దళంలో జోష్ నింపాయి. రాష్ట్ర గవర్నర్ పాజిటివ్ వ్యాఖ్యలు ఎన్నికల ముందు చేయడం అంటే ప్రజల్లో మంచి మైలేజ్ తెస్తాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో విస్తృతంగా నరసింహన్ కామెంట్స్ బాగా ప్రచారం చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. తమ పార్టీ మిషన్ భగీరధకు గవర్నర్ ను మించిన బ్రాండ్ అంబాసిడర్ లేడనే రేంజ్ లో టి సర్కార్ శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి.
గవర్నర్ ను మార్చాలన్న డిమాండ్ వచ్చాకే ...
గవర్నర్ నరసింహన్ కూడా తానేమిటో రెండు రాష్ట్రాల వారికి చెప్పేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీలోని టిడిపి ప్రభుత్వం ఇప్పటికే నరసింహన్ తమపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని లోలోపల మదన పడుతుంది. ఆయన చర్యలు చాలా అలానే వున్నాయి. దాంతో ఇటీవలే తన మిత్రపక్షం బిజెపితో ఎపికో కొత్త గవర్నర్ ను నియమించాలంటూ లేఖను సైతం టిడిపి కేంద్రానికి రాయించిందన్న ప్రచారం నడిచింది. నేరుగా కేంద్రంతో తలపడలేని పరిస్థితుల్లో బిజెపి ఏపీ అధ్యక్షుడు చేతే టిడిపి ఈ లేఖ కొట్టిందన్నది పొలిటికల్ టాక్. ఈ నేపథ్యంలోనే గవర్నర్ నరసింహన్ నెమ్మదిగా తన విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. తనకు అత్యంత గౌరవాన్ని ఇచ్చే టి సీఎం చంద్ర శేఖర రావు కి రుణం తీర్చుకునే పనిలో పడి తన రాజకీయ చతురత చూపిస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఇదే స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సాగుతూన్నా ఏనాడు నరసింహన్ ఈ రేంజ్లో చంద్రబాబు సర్కార్ కి కితాబులు ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజు గారి మొదటి భార్య మంచిది అంటే.. అనే మాటను చర్చల్లో విశ్లేషకులు ఏపీ తెలంగాణ వ్యవహారంలో గవర్నర్ పాత్ర అంశంలో వాడేస్తున్నారు.