ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి ప్యాకేజీ పనులను మంత్రి హరీశ్ రావుతో కలిసి సందర్శించారు. అయితే ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ సర్కార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి వారం రోజుల కొకసారి గవర్నర్ ను కలుస్తారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటారు. ఇటీవల గవర్నర్ ను కలిసిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాల్సిందిగా కోరారు. ఈమేరకు ఆయన మంత్రి హరీశ్ రావుతో కలిసి ప్రాజెక్టుకు వెళ్లారు.
కాళేశ్వరం....చంద్రశేఖరరావు....
అయితే ఈ సందర్భంగా గవర్నర్ కేసీఆర్ ను మామూలుగా పొగడ లేదు. రెండేళ్ల క్రితం కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ పవర్ పాయింగ్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు తాను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదని, కలల చంద్రశేఖర్ రావు అనుకున్నానని అన్నారు. అయితే ఇప్పడు ప్రాజెక్టును సందర్శించినప్పుడు కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాల్సి వస్తుందన్నారు. అలాగే హరీశ్ రావును కూడా కాళేశ్వరరావుగా పిలవాల్సి ఉంటుందన్నారు. జూన్ నాటికి కాళేశ్వరం మొదటి దశ పనులు పూర్తవుతాయని, పనులు వేగంగా జరుగుతున్నాయని గవర్నర్ కితాబిచ్చారు.
గుర్రుమంటున్న కాంగ్రెస్ నేతలు....
ఇటీవలే కాంగ్రెస్ నేతలకు, గవర్నర్ కు మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఇసుకమాఫియా మీద ఫిర్యాదు చేయడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలను గవర్నర్ ఎదురు ప్రశ్నలు వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు గవర్నర్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీకి గవర్నర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతున్నా ప్రభుత్వాన్ని గవర్నర్ వెనకేసుకు రావడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పినట్లే గవర్నర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కేసీఆర్ ను పొగడటం కాంగ్రెస్ నేతలకు రుచించడం లేదు.
తమ ప్రయత్నాల్లో ఏపీ బీజేపీ నేతలు.....
దీంతో పాటు ఏపీలో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నా అక్కడకు వెళ్లని గవర్నర్ ఇక్కడకు వెళ్లి కితాబివ్వటమేంటని ఆంధ్ర నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు గవర్నర్ ను మార్చాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలన్నది వారి ముఖ్యమైన డిమాంద్. వచ్చే బడ్జెట్ సమావేశాలను కొత్త గవర్నర్ చేత ప్రారంభించాలని ఏపీ బీజేపీ నేతలు హస్తినలో తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ చేసిన కామెంట్లు మరోసారి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.