వైసీపీ అధినేత జగన్ ప్రతి వర్గానికి చేరువయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో చేసిన పొరపాట్లుఈసారి చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ విషయంపై జగన్ వెనక్కు తగ్గారు. చంద్రబాబు అది అందుకుని అధికారానికి దగ్గరయ్యారు. దీంతో జగన్ రైతు పక్షపాతిగా నిలబడేందుకు పాదయాత్రను చక్కగా వినియోగించుకుంటున్నారు. కొద్దినెలల క్రితం వైసీపీ ప్లీనరీ సందర్భంగా జగన్ ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం కింద యాభై వేల రూపాయల రుణాన్ని చెల్లిస్తామన్నారు.
రైతు సమస్యలు వింటూ...
కాని గడచిన 41 రోజులుగా పాదయాత్ర చేస్తున్న జగన్ కు రైతుల నుంచి పెద్దయెత్తున వినతులు వచ్చాయి. రైతులతో ముఖాముఖి సందర్భంగా అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. దీంతో వైసీపీ ప్లీనరీలో చేసిన తీర్మానాన్ని జగన్ పక్కన పెట్టారు. కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులే కాకుండా రైతుందరికీ పెట్టుబడి సాయం యాభై వేలు రుణంగా అందిస్తామని ప్రకటించడం విశేషం. రాష్ట్రంలోని ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేలా చూస్తామని జగన్ హామీ ఇచ్చారు.
ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం...
గత ఎన్నికల్లో రైతు రుణమాఫీయే తమ కొంపముంచిదని భావించిన వైసీపీ అధినేత ఈసారి మాత్రం అందుకు ధీటుగా దూసుకు వెళుతున్నారు. రైతులకు ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధమని తన పాదయాత్రలో ప్రకటిస్తున్నారు. అలాగే 12,500లు ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. వీటితో పాటు యాభై వేల రూపాయల రుణం అందిస్తామని చెప్పారు. మొత్తం మీద పాదయాత్ర సందర్భంగా రైతులు తమ సమస్యలను చెప్పుకోవడంతో జగన్ రైతుల విషయంలో గతంలో చేసిన పొరపాట్లు ఈసారి చేయకూడదని నిర్ణయించుకున్నట్లుంది జగన్. అయితే ఈ హామీలు జగన్ అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయా? లేదా? అన్నది మాత్రం వేచిచూడాల్సిందే.