గడ్కరీ రాకపోవడానికి కారణం అదేనా?

Update: 2017-12-21 03:30 GMT

పోలవరం ప్రాజెక్టు క్రెడిట్ పొందేందుకు రెండు పార్టీలూ తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాయి. ఎవరికివారు క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకునేందుకు అన్ని రకాలుగా యత్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి. లక్షలాది ఎకరాలకు సాగునీరందించే ఈ ప్రాజెక్టును తామే కట్టామని టీడీపీ క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే నిధులిచ్చేది మేము... ఓట్లు దండుకునేది మీరా? అంటూ బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. కేంద్ర ఇచ్చే డబ్బులతో ప్రాజెక్టు నిర్మిస్తూ అంతా మావల్లనే అంటూ ప్రచారం చేసుకోవడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఇందుకోసమే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ ఈ నెల 22వ తేదీన పోలవరం సందర్శనకు వస్తానని చెప్పారు. అయితే ఆయన పోలవరం పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది.

గడ్కరీ వస్తే..సమస్యలు పరిష్కారమవుతాయని...

గడ్కరీ ఇకపై నెల రోజులకొకసారి పోలవరం వచ్చి ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షిస్తానని చెప్పారు. దీనికి టీడీపీ నేతలు కూడా ఆనందపడ్డారు. వాస్తవానికి గత రెండు నెలల నుంచి కేంద్ర తెలుపుతున్న అభ్యంతరాలతో పోలవరం పనులు మందగించాయనే చెప్పొచ్చు. ఈవిషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గడ్కరీ వస్తే నిధులు వెంటనే సమకూరుతాయని, పనుల్లో వేగం పెరుగుతుందని చంద్రబాబు ఆశించారు. కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ ను మార్చాలన్నా కేంద్రం అంగీకరించడం లేదు. ఇందుకోసం ట్రాన్స్ ట్రాయ్ కు నెల రోజుల సమయం ఇచ్చారు. గడ్కరీ ఈ నెల 22 న వస్తే ట్రాన్స్ ట్రాయ్ సంగతి కూడా తేల్చేద్దామనుకున్నారు చంద్రబాబు. కాని గడ్కరీ పర్యటన వాయిదా పడటంతో చంద్రబాబు డీలా పడ్డారు. ఇప్పటికే కాఫర్ డ్యాం పనులు కూడా మందకొడిగా సాగుతున్నాయి. గడ్కరీ వస్తే దీనిపై క్లారిటీ వస్తుందనుకున్న చంద్రబాబుకు నిరాశే ఎదురయింది. గడ్కరీ ఈ నెల 26వ తేదీవస్తున్నారన్న సమాచారం అందినట్లు తెలిసింది.

తమకే క్రెడిట్ దక్కాలని....

మరోవైపు ఏపీ బీజేపీ నేతలు పోలవరంపై దూకుడు పెంచారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సమక్షంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని పలువురు ఏపీ బీజేపీ నేతలు కలిశారు. విశాఖ ఎంపీ హరిబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు కలిసి పోలవరంపై సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న సమయానికి పూర్తి చేయాలని వారు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. పోలవరంపై కేంద్ర చెబుతున్న అభ్యంతరాలపై కూడా ఆరాతీశారు. అయితే గడ్కరీ మాత్రం పోలవరం సకాలంలోనే పూర్తి చేస్తామని, ప్రాజెక్టు గురించి అన్ని వివరాలు తెప్పించుకున్న తర్వాత తాను అక్కడకు వస్తానని బీజేపీ నేతలతో గడ్కరీ చెప్పినట్లు సమాచారం. 2019 నాటికి పోలవరం పూర్తి చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు.

Similar News