గజల్‌ గొంతే... ఆయనను ఇరికించిందా?

Update: 2018-01-05 03:54 GMT

తెలుగు రాష్ట్రాల్లో గజల్‌కు గుర్తింపు రావడంలో శ్రీనివాస్‌ కృషి గణనీయంగా ఉంది. తెలుగు భాషలో గజల్స్‌ ఆలపిస్తూ పండిత., పామర తారతమ్యం లేకుండా అన్ని వర్గాలను అలరించే శైలితో అందరికి చేరువయ్యారు. పశ్చిమ గోదావరిలో మొదలైన శ్రీనివాస్‌ గజల్‌ ప్రస్థానం అతి తక్కువ కాలంలోనే ఖండాంతరాలకు పాకింది. చిన్న వయసులోనే కీర్తి ప్రతిష్టలు సంపాదించిన గజల్‌ శ్రీనివాస్‌ ఓ దశలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. పేరూ., పలుకుబడి రావడంతో గజల్ శ్రీనివాస్‌ రాజకీయ నాయకులతో సైతం చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. వాటిని అడ్డు పెట్టుకునే మహిళల్ని ప్రలోభపెట్టి లొంగదీసుకునే వారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏళ్ల తరబడి సంపాదించిన పేరు ప్రతిష్టలన్ని ఒక్క ఉదంతంతో చెరిగిపోయాయి. అసలు గజల్‌ శ్రీనివాస్ ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోవడం వెనుక చాలా పరిణామాలే జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన స్వయంకృతాపరాధమే ఎక్కువగా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు ముందు కొందరు ప్రవాస తెలుగు పారిశ్రామికవేత్తలకు ఆయన ఆఫీసు కార్యాలయంగా వినియోగిస్తున్న గెస్ట్‌ హౌస్‌లో బస కల్పించారట. తెలుగు సాహిత్యం., గజల్‌ శ్రీనివాస్‌ సాహిత్యాన్ని అభిమానించే వారి సమక్షంలో చేసిన వ్యాఖ్యలే ఆయన కొంప ముంచాయి. తన పాండిత్యం., ప్రజ్ఞాపాటవాలను చెప్పుకునే క్రమంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన నామినేటెడ్‌ పదవిలో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తిని కించపరిచేలా గజల్‌ దూషించినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో శృతి మించి మాట్లాడటమే కాకుండా., తన ముందు., తన ప్రతిభ ముందు అవతలి వ్యక్తి ఏ మాత్రం సరితూగడని అసభ్యకరంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఒకటికి రెండు సార్లు ఇదే తరహాలో ప్రవర్తించడంతో ... గజల్‌ శ్రనివాస్ ఆతిథ్యాన్ని స్వీకరించిన మిత్రులు వారించే ప్రయత్నం కూడా చేశారట. ఆ తర్వాత ఈ సంగతి తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న వ్యక్తి దృష్టికి వెళ్లడంతో కథ మలుపు తిరిగినట్లు తెలుస్తోంది.

భాషను యాసను దూషించిన ఫలితమేనా.....?

వ్యక్తిగత ఇగోతో గజల్‌ శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణకు చెందిన కవి మనసును తీవ్రంగా గాయపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పక్కా వ్యూహంతోనే గజల్‌ చుట్టూ ఉచ్చు బిగించారు. తెలంగాణ భాష., యాసల్ని కించపరిచేలా గజల్‌ చేసిన వ్యాఖ్యలపై ఖచ్చితంగా బదులు తీర్చుకోవాల్సిందేనని అందుకు సహకరించాల్సిందిగా ప్రభుత్వ పెద్దల్ని కోరినట్లు సమాచారం. కీలక స్థానంలో ఉన్న వ్యక్తులు సైతం ఇందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఫలితంగా పక్కా ప్రణాళికతో గజల్‌ చుట్టూ ఉచ్చు బిగించారు. దీనికి ఆయన వ్యక్తిగత వ్యవహార శైలి కలిసొచ్చింది. గజల్‌ శ్రీనివాస్‌ వ్యక్తిగత సంబంధాలు., వ్యవహార శైలి తెలియడంతో వారి పని కూడా సులువైంది. అప్పటికే గజల్‌ ప్రవర్తనతో విసిగిపోవడంతో బాధితురాలికి సాంకేతికంగా సహకరించారు. నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినప్పట్నుంచి గజల్‌ లీలలన్ని కెమెరాలో నిక్షిప్తమవుతూ వచ్చాయి. గత నెల 29న బాధితురాలు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసే సమయానికే వీడియో ఆధారాలను పక్కాగా సేకరించింది. రెండవ తేదీన విచారణ కోసం శ్రీనివాస్‌ను పిలిపించి... ప్రశ్నించిన గంటల వ్యవధిలోనే వీడియోలు ఒక్కొక్కటిగా లీకవుతూ వచ్చాయి. అదే సమయంలో గజల్‌ శ్రీనివాస్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దంటూ రాజకీయ పక్షాలకు సైతం సూచనలు అందడంతో కష్టాల్లో కూరుకుపోయాడు. బాధితురాలికి అదే కార్యాలయంలో పనిచేసే వీడియో ఎడిటర్‌., గజల్‌ శ్రీనివాస్‌ వ్యక్తిగత సహాయకుడు సైతం సహకరించడంతో ఆధారాలను సేకరించడం సులువైంది. ఈ మొత్తం వ్యవహారంలో బాధితురాలికి అండగా నిలిచిన ప్రముఖుడికి ఒకే దెబ్బకు రెండు పనులు పూర్తయ్యాయి. తనను ఎగతాళి చేసిన శ్రీనివాస్‌పై పగ తీర్చుకోవడం., బాధితురాలితో పోలీసులకు ఫిర్యాదు చేయించడం ద్వారా ఆమె కోపాన్ని కూడా చల్లార్చారు. మొత్తమ్మీద గజల్సా పాడాల్సిన గొంతుతో నోరు జారి చేసిన విమర్శలు ఆయన పాలిట శాపాలయ్యాయి.

Similar News