గజల్ పై కేసు నిలిచేనా ...?

Update: 2018-01-03 02:30 GMT

సెలబ్రిటీలపై కేసులు అంశం గజల్ శ్రీనివాస్ పై కేసు అరెస్ట్ తో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రముఖులపై కేసులు నమోదు కావడమే తరువాయి వాటికొచ్చే ప్రచారం అంతా ఇంతా కాదు. అయితే కేసు కోర్ట్ విచారణ కు వెళ్ళి శిక్షలు పడుతున్న సందర్భాలు ఎన్ని వున్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికల పై హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఇలాంటి కేసుల్లో ముందు జైలు తరువాత బెయిలు, ఆనక సరైన సాక్ష్యాధారాలు లేక నిందితులు నిర్దోషులుగా విడుదల అవుతున్న సంఘటనలే కోకొల్లలు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వంటి వారు అతి తక్కువ సంఖ్యలో శిక్ష అనుభవిస్తే, తాగి డ్రైవ్ చేసి పలువురి మరణానికి కారణమైన సల్మాన్ ఖాన్, నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పుల కేసులో బాలకృష్ణ, గవర్నర్ ఎన్ డి తివారి లైంగిక వేధింపుల కేసు, సహస్రావధాని నాగఫణి శర్మ వంటి వారు ఆయా కేసుల్లో బయటపడిన సందర్భాలను పలువురు ప్రస్తావిస్తూ వ్యవస్థలో లోపాలను ప్రశ్నిస్తూ నిలదీస్తున్నారు.

మ్యానేజ్ చేస్తే .....

డబ్బు పలుకుబడి, అధికారం అండగా వుంటే వ్యవస్థలను మ్యానేజ్ చేయడం కష్టం కాదని నెటిజెన్స్ సామాజిక వేదికలపై నినదిస్తున్నారు. అవినీతి విచ్చలవిడిగా నడుస్తున్న నేటి కాలంలో వ్యవస్థలను సులువుగా కొనేయొచ్చన్నది కొందరి వాదన. ఎక్కడో ఒక చోట చిన్న అవకాశం లభిస్తే పోలీసులు, కోర్ట్ లు, మీడియా పీకేది ఏమి ఉండదని అంటున్నారు ప్రజలు. ముఖ్యంగా ఎంతో బలంగా నమోదు అయ్యే కేసుల్లోనే సాక్ష్యాలు చివరిలో వీగిపోయి ప్రజల ముందు న్యాయస్థానాలు దోషులుగా నిలుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా ఇటీవల తెలంగాణాలో నానా హంగామా సృష్టించిన ఓటుకు నోటు ,డ్రగ్స్ కేసులను ఉదాహరణగా చూపుతున్నారు. డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీ ప్రముఖులను విచారించి రోజుల తరబడి హంగామా సృష్ట్టించి, ఈ కేసులో అరెస్ట్ అయి జైల్లో వున్న కీలక నిందితుడు కెల్విన్ పై ఛార్జ్ షీట్ కూడా కోర్ట్ లో సిట్ వెయ్యకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఫలితంగా కెల్విన్ కి బెయిల్ మంజూరు అయ్యిందని ఎక్కడో అక్కడ జరిగే సాంకేతిక తప్పిదాలు, అవినీతి పరుల అండదండలు నేరస్థులను తప్పించుకునేలా చేయడం చట్టాలపై ప్రజలకు చిన్న చూపు ఉండేలా చేస్తుందని అంతా విమర్శిస్తున్నారు. తాజాగా మహిళపై లైంగిక వేధింపుల కేసు సైతం మినహాయింపు కాదని గజల్ శ్రీనివాస్ కి శిక్ష పడటం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు.

Similar News