గజల్ అడ్డంగా దొరికింది ఇలా....?

Update: 2018-01-03 03:47 GMT

గజల్‌ శ్రీనివాస్‌ వేధింపులు శృతిమించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితురాలు భావించింది. అయితే పలుకుబడి ఉన్న వ్యక్తి కావడం, కేవలం ఫిర్యాదు మాత్రమే చేస్తే ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో స్వయంగా స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. సేవ్‌ టెంపుల్‌ కార్యాలయంలో శ్రీనివాస్‌ వినియోగిస్తున్న బెడ్‌రూమ్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇందులో గజల్‌ శ్రీనివాస్, పార్వతి రాసలీలలతోపాటు పార్వతితో కలిసి బాధితులురాలు శ్రీనివాస్‌ కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా గత శుక్రవారం (డిసెంబర్‌ 29) పంజాగుట్ట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. వీడియో రికార్డులతోపాటు వాయిస్‌ రికార్డులు, ఫొటోలు పోలీసులకు అందించింది. దీంతో ఐపీసీ 354, 354 (ఏ), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు విషయం గోప్యంగా ఉంచి ప్రాథమిక దర్యాప్తు చేశారు. అన్ని ఆధారాలు సేకరించి మంగళవారం ఉదయం ఆనంద్‌నగర్‌ కాలనీలోని తన నివాసంలో గజల్‌ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.

ఠాణాలో టేబుల్‌పై దరువేస్తూ.....

గజల్‌ శ్రీనివాస్‌ను పోలీసుస్టేషన్‌కు తరలించి డాక్యుమెంటేషన్‌ పూర్తయ్యే వరకు దాదాపు రెండు గంటల పాటు ఠాణాలోని ఇంటర్వ్యూ రూమ్‌లో ఉంచారు. ఈ సమయంలోనూ ఎలాంటి పశ్చాత్తాప ఛాయలు లేని గజల్‌ శ్రీనివాస్‌ అక్కడి టేబుల్‌పై దరువేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడున్న మీడియా ప్రతినిధులు రికార్డు చేశారు. అనంతరం గజల్‌ శ్రీనివాస్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో శ్రీనివాస్‌ తరఫు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే గజల్‌ శ్రీనివాస్‌ పలుకుబడి ఉన్న వ్యక్తని, బెయిల్‌పై బయటకు వస్తే కేసులో ఫిర్యాదిగా ఉన్న బాధితురాలిని బెదిరించడం, సేవ్‌ టెంపుల్‌ సంస్థ కార్యాలయంలో ఉన్న సీసీకెమెరా ఫుటేజ్‌లతోపాటు ఇతర సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారంటూ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన్ను రెండు వారాల పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రెండు పిటిషన్లపై వాదనలను విన్న న్యాయస్థానం.. శ్రీనివాస్‌కు ఈ నెల 12 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో పార్వతిని రెండో నిందితురాలిగా చేర్చామని, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఆధ్యాత్మిక ముసుగులో.....

ఆధ్యాత్మిక, దేశభక్తి, మహిళల భద్రత.. ఇలా ఎన్నో అంశాలపై గజల్స్‌ రాసి ఆలపిస్తున్న కేసిరాజు శ్రీనివాస్‌ అలియాస్‌ గజల్‌ శ్రీనివాస్‌ లైంగిక వేధింపుల కేసులో అరెస్టయ్యాడు. తాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేస్తున్న సంస్థలోని ఉద్యోగినినే వేధించి అడ్డంగా బుక్కయ్యాడు. బాధితురాలు పక్కా సాక్ష్యాలతో పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయన బాగోతం బయటపడింది. ఈ కేసులో పార్వతి అనే మహిళను కూడా నిందితురాలిగా చేర్చినట్టు ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రవీందర్‌ మంగళవారం వెల్లడించారు. నాంపల్లి కోర్టులో నిందితుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లు బుధవారానికి వాయిదా పడ్డాయి. దీంతో గజల్‌ శ్రీనివాస్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

Similar News