ఖుషి ఖుషి గా కేసీఆర్ ...!

Update: 2017-12-01 06:30 GMT

రెండు మెగా ఈవెంట్లను గ్రాండ్ గా ముగించి అంతర్జాతీయ యవనికపై భాగ్యనగర కీర్తిని ఎగురవేశామన్న సంతృప్తిలో టి సీఎం కేసీఆర్ హుషారుగా వున్నారు. పదేళ్లుగా హైదరాబాద్ వాసులు ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రధానితో ప్రారంభం, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేశామని ఆనందపడుతున్నారు గులాబీ బాస్. ముఖ్యంగా అమెరికా అధ్యక్షురాలి కుమార్తె ఇవాంకా పర్యటన, ఆమె కోసం చేపట్టిన భద్రతా ఏర్పాట్లు అద్భుతంగా నిర్వహించారని అధికార యంత్రాగాన్ని, పోలీసులను కేసీఆర్ అభినందించారు. ఈ మెగా కార్యక్రమాల్లో ఎలాంటి చిన్నపాటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయని కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు గర్వపడేలా కృషి చేసిన అందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ముప్పుతిప్పలు పెట్టినా ...

భద్రతా కారణాలరీత్యా అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులు ఇవాంక టూర్ షెడ్యూల్ ఇవ్వలేదని మీడియా కు చెప్పుకొచ్చారు కేసీఆర్. ఆమె ఎక్కడికి వెళ్ళేది ఏమి చేసేది వారికి మాత్రమే తెలుసన్నారు. అయినా కానీ తెలంగాణ పోలీసులు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ అధికారులకు ధీటుగా అమోఘమైన నెట్ వర్క్ తో ఆమె షెడ్యూల్ సాఫీగా సాగేలా ప్లాన్ చేశారన్నారు. టి పోలీస్ ప్రతిభకు సిఐఐ అధికారులు ప్రశంసల జల్లు కురిపించారని డిజిపి మహేంద్ర రెడ్డి ని అభినందించి వెళ్లారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అభినందనలు రావడం విశేషమని కేసీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ ఖుషి ఖుషి గా చెప్పుకొచ్చారు. మొత్తంమీద రెండు ప్రధాన కార్యక్రమాలు గ్రాండ్ సక్సెస్ టిఆర్ఎస్ శ్రేణులకు మంచి జోష్ ని అందించింది.

Similar News