ఖాకీ వెర్సెస్ కోడి ...!

Update: 2018-01-14 06:30 GMT

సంక్రాంతి పండుగ మొదలైపోయింది. దాంతో బాటు సంప్రదాయం ముసుగులో కోట్ల రూపాయలు చేతులు మారే కోడిపందాల సీన్ మొదలైపోయింది . సుప్రీం కోర్టు ఆదేశాలను అటు పోలీసులు ఇటు పందెం రాయుళ్లు ఎవరికి వారు అనుకూలంగా భావించుకుని ఎవరి పని వారు మొదలు పెట్టేశారు. కోళ్లపందాలు రహస్య ప్రాంతాల్లో పోలీసులు రాలేని కీలక స్థావరాల్లో యధావిధిగా ప్రారంభించేసారు. మరోవైపు పోలీసులు దాడులు తీవ్రం చేశారు. ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి కోడి పందాలపై నిఘా తీవ్రం చేయడంతో బాటు కత్తికట్టి పందాలు నిర్వహిస్తే జైలుకే అంటూ ప్రచార ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఎపిలేదు, తెలంగాణ లేదు అన్నిటా ...

కోడిపందాలంటే గోదావరి జిల్లాలే అన్న స్థాయిలో గతంలో ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణ, ఆంధ్రాలో నిర్వాహకులకు కాసులు కురిపించే కోడిపందాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా సాగిపోతున్నాయి. కత్తి కట్టకుండా అనే చిన్న వెసులుబాటుతో మొత్తానికి అనుకున్నది అనుకున్నట్లు పందాలు చక్కగా సాగించేస్తున్నారు. వీరికి చెక్ పెట్టేందుకు పోలీసులు నానాపాట్లు పడుతున్నారు. ముఖ్యంగా ఏపీలో కృష్ణా గోదావరి జిల్లాలో చెక్ పోస్ట్ లు పికెటింగ్ లు పోలీసులు ఏర్పాటుచేసుకోవాలిసి వచ్చిందంటే పందాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. ఇప్పటికే భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో పందాలు రెండు రోజుల ముందే జోరందుకున్నాయి. కేసులు చిన్నా చితకా పెట్టి తాము అడ్డుకున్నామని చెప్పుకునే పనిలో పోలీసులు పడ్డారు.

Similar News