క‌లెక్ట‌ర్ల బ‌దిలీలు... ఎమ్మెల్యేల సంబురాలు...!

Update: 2018-01-05 00:30 GMT

తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రిగిన క‌లెక్ట‌ర్ల బ‌దిలీల్లో ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. కొన్ని జిల్లాల్లో క‌లెక్ట‌ర్లు బ‌దిలీ కావ‌డంతో అధికార పార్టీ నేత‌లు సంబురాలు చేసుకున్నారు. ఇక త‌మకు ఇబ్బందులు త‌ప్పిన‌ట్టేన‌ని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌తో చెబుతున్నారు. జ‌న‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ‌దేసేన పెద్ద‌ప‌ల్లి క‌లెక్ట‌ర్‌గా బ‌దిలీ కావ‌డంతో ప‌ట్ట‌ణంలోని బ‌తుక‌మ్మ కుంట వ‌ద్ద ఆరోజు రాత్రి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరిరెడ్డి అనుచ‌రులు ప‌టాకులు కాల్చి సంబురాలు చేసుకున్న‌ట్లు స‌మాచారం. బతుక‌మ్మ కుంట భూ ఆక్ర‌మ‌ణ వివాదంలో స్వ‌యంగా క‌లెక్ట‌ర్ శ్రీ‌దేవ‌సేన ముత్తిరెడ్డిపై ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఎమ్మెల్యే వర్సెస్ కలెక్టర్....

ఈ విష‌యంలో దేవ‌సేన ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో వ్య‌వ‌హ‌రించారు. వీరిద్ద‌రి వార్ వ్య‌వ‌హారం ప్ర‌భుత్వ‌, అధికార వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎవ్వ‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఆ విష‌యంలో ఆమె అన్ని ఆధారాల‌తోనే సీఎంకు నివేదిక స‌మ‌ర్పించి, బ‌హిరంగంగా మాట్లాడార‌ని అప్ప‌ట్లో ప్రచారం జ‌రిగింది. అదేవిధంగా అభివ‌ద్ధి ప‌నులు, ఇత‌ర ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌లోనూ ఇద్ద‌రిమ‌ధ్య స‌మ‌న్వ‌యం లేక‌పోవ‌డంతో ప‌నులు ముందుకెళ్ల‌లేద‌నే విమ‌ర్శ‌లు కూడా వెల్లువెత్తాయి. అంతేగాకుండా ఏ విష‌య‌మైనా త‌న‌తోనే చ‌ర్చించాల‌ని, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల ఒత్తిడికి త‌ల‌గ్గొద్ద‌ని సీఎం క‌లెక్ట‌ర్ల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఆ ఎమ్మెల్యే కూడా ఆనందమే...

ఈ నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ అభివ‌ద్ధి ప‌నులు, ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో ఎమ్మెల్యే జోక్యాన్నిత‌గ్గించ‌డంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. అంతేగాకుండా సీఎంకు ముత్తిరెడ్డిపై క‌లెక్ట‌ర్ ఫిర్యాదు కూడా చేసిన‌ట్లు తెలిసింది. ఎట్ట‌కేల‌కు ఆమె బ‌దిలీ కావ‌డంతో ఎమ్మెల్యేతోపాటు ఆయ‌న అనుచ‌రులు ఆనంద‌ప‌డుతున్నారు. మానుకోట జిల్లాలోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. క‌లెక్ట‌ర్ ప్రీతిమీనా బ‌దిలీకావ‌డంతో ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్ ఊపిరి పీల్చుకున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో క‌లెక్ట‌ర్‌తో ఆయ‌న అనుచిత ప్ర‌వ‌ర్త‌న తీవ్ర దుమారానికి దారితీసింది. పోలీసు కేసు, సీఎంకు క‌లెక్ట‌ర్ ఫిర్యాదు వ‌ర‌కూ వెళ్లింది. కొన్ని అభివృద్ధి ప‌నుల విష‌యంలోనూ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు, క‌లెక్ట‌ర్ ప్రీతిమీనాకు మ‌ధ్య ఓ రేంజ్‌లో వార్ న‌డిచింది. ఏద‌మైనా తెలంగాణ‌లో క‌లెక్ట‌ర్ల బ‌దిలీలు జ‌రిగితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వారి అనుచ‌రులు సంబురాలు చేసుకోవ‌డం విశేషం.

Similar News