క్యాష్ లెస్ కంట్రీగా మార్చేద్దాం : కేసీఆర్

Update: 2016-11-28 14:49 GMT

నోట్ల రద్దు పర్యవసానంగా ఏర్పడిన పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వాటిని దూరం చేయడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లు, నగదు రహిత లావాదేవీలు జరిగేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాల గురించి ఎజెండా తయారు చేయాల్సిందిగా డిజిటల్ లావాదేవీలను ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలో రూపకల్పన చేయాల్సిందిగా ఐదుగురు ఐఏఎస్ అధికారులకు ప్రత్యేకంగా పురమాయించి.. వారి సూచనల మేరకు కేబినెట్ సమావేశంలో చర్చను సాగించారు. కేబినెట్ భేటీ అనంతరం కేసీఆర్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి .. మొత్తం పరిణామాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదో.. వాటితో పాటు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నదో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.

తెలంగాణను క్యాష్ లెస్ స్టేట్ గా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం అంటూ కేసీఆర్ వివరించారు. మోడల్ గా ఒక నియోజకవర్గాన్ని ప్రాథమికంగా క్యాష్ లెస్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేసీఆర్ వివరించారు. అందుకు సిద్ధిపేట నియోజకవర్గాన్ని ఎంపిక చేశాం అన్నారు. సిద్దిపేటలు ప్రతి చిన్న ఆర్థిక లావాదేవీ కూడా డిజిటల్ విధానంలో జరిగేలా గరిష్టంగా 500 రూపాయలు మాత్రమే నగదు వాడేలా ప్రాథమికంగా చర్యలు తీసుకుంటాం అన్నారు. క్రమంగా ఆమాత్రం కూడా నగదు వాడని డిజిటల్ నియోజకవర్గంగా తీర్చదిద్దుతాం అన్నారు.

ప్రజల కష్టాలు దూరం చేయడానికి సంబంధించి తన అనుభవాలను, అవగాహనను ప్రధానితో పంచుకున్నట్లుగా కేసీఆర్ చెప్పుకొచ్చారు. అటు ఢిల్లీ వెళ్లినప్పుడు, హైదరాబాదులో కలిసినప్పుడు కూడా ఇదే మాట్లాడినట్లు చెప్పారు.

అయితే అందుకోసం కేసీఆర్ అనేక సూచనలు చేశారు.

- తెలంగాణలో ప్రభుత్వ పరంగా చెల్లింపులు ఉండే అన్నిచోట్ల స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేస్తాం.

- బ్యాంకులు డిజిటల్ లావాదేవీలపై వేసే రుసుములను పూర్తిగా తొలగించాలి.

- స్వైపింగ్ మెషిన్లు ఉండే వ్యాపారుల మీద విధించే ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్)ను కూడా బ్యాంకులు పూర్తిగా తొలగించాలి.

- ఆదాయపు పన్నులాంటి వాటిని కూడా తొలగించాలి. జీఎస్టీ మాదిరిగా బీటీటీ – బ్యాంక్ ట్రాన్సాక్షన్ టాక్స్ ను అమల్లోకి తీసుకురావాలి. ఆదాయపు పన్నులాంటివేమీ లేకుండా... బ్యాంకులో అకౌంటులో డిపాజిట్ అయ్యే ప్రతి మొత్తం మీద కనిష్టమొత్తంలో పన్ను విదించాలి. దీనివల్ల కేంద్రప్రభుత్వానికే మేలు జరుగుతుంది.

- ఇలాంటివన్నీ కేంద్రం విధిగా అమల్లోకి తీసుకువస్తేనే నగదు రహిత లావాదేవీలు పెరగడం సాధ్యమవుతుంది.

- ప్రజలకు వీలుగా టీఎస్ వ్యాలెట్ అనే కొత్త యాప్ ను కూడా తీసుకువస్తున్నాం. ఐటీ శాఖ దీనిపై పని ప్రారంభించింది.

వీటితో పాటు ఇంకా అవినీతి ఊసే లేని తెలంగాణను ఆవిష్కరించడానికి కూడా కృషి జరుగుతుందని కేసీఆర్ ప్రకటించారు. ఈ నగదు రహిత లావాదేవీల వ్యవహారాన్ని పర్యవేక్షించడానికి 5గురు ఐఏఎస్ అధికార్లతో ఓ టాస్క్ ఫోర్స్ ను , కేంద్రంతో అనుసంధానమై పనిచేయడానికి ముగ్గురు సభ్యులతో మరో కమిటీని వేస్తున్నట్లు కూడా కేసీఆర్ ప్రకటించారు.

నల్లధనం విషయంలో కాంగ్రెస్ మీద నిప్పులు చెరిగారు. నల్లధనాన్ని సృష్టించిందే కాంగ్రెస్ అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నల్లడబ్బు మీద నడుస్తున్న సర్కారుగా అభివర్ణించిన కిషన్ రెడ్డిని గాలి మాటలు మాట్లాడుతున్నట్లుగా కేసీఆర్ ఎత్తిపొడిచారు. నవంబరు 8వ తేదీ వరకు మోదీ సర్కారు కూడా నల్లధనం మీదనే నడిచిందా అని ప్రశ్నించారు. దేశాన్ని గోల్ మాల్ చేసేఅవసరం ప్రధానిగా మోదీకి ఉంటుందని తాను అనుకోవడం లేదని, నోట్ల రద్దు వ్యవహారానికి తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తున్నదని కేసీఆర్ వెల్లడించారు .

Similar News