కోహ్లీ నా మాజాకానా ...!

Update: 2018-02-08 02:30 GMT

ఇటీవలే అండర్ 19 ప్రపంచ క్రికెట్ కప్ ను సమున్నతంగా పైకెత్తింది భారత యువ క్రికెట్ జట్టు. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కుర్రోళ్ళు కొట్టిన విక్టరీలు సీనియర్స్ జట్టుకు స్ఫూర్తి గా నిలిచాయి. టెస్ట్ మ్యాచ్ లలో పేలవమైన ఆట తీరుతో దక్షిణాఫ్రికాపై రెండు టెస్ట్ లు కోల్పోయిన భారత సీనియర్లు ఇప్పుడు వన్డేల్లో చెలరేగిపోతున్నారు. ఏ మాత్రం ఆతిధ్య జట్టును ఉపేక్షించడం లేదు. తాము ఆడేది ఇండియాలో నా అని సఫారీలు భావించే రీతిలో వారి సొంత గడ్డపై వరుస మూడు మ్యాచుల్లో విజయాలు అందిపుచ్చుకుని ఆరు వన్డేల సిరీస్ లో దూసుకుపోతుంది విరాట్ సేన.

కోహ్లీ కుదురుకుంటే.....

తాను కుదురుకుంటే ప్రత్యర్థికి చుక్కలు చూపించే టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో వన్డేలో 160 పరుగులు సాధించి జట్టు 303/6 పరుగుల టార్గెట్ ప్రత్యర్థికి సవాల్ గా ఉంచాడు. కోహ్లీ ఒక్కడు చేసిన పరుగులు టీం ఇండియా మొత్తం బ్యాట్స్ మెన్ సాధించలేదంటే విరాట్ ఆట ఎలా సాగిందో తెలుస్తుంది. 119 బంతులకు కెరీర్లో 34 వ సెంచరీ కొట్టిన విరాట్ తన 160 పరుగుల్లో 12 ఫోర్స్ 2 సిక్స్ లు మాత్రమే కొట్టాడు. రోహిత్ శర్మ డకౌట్ కావడంతో శిఖర ధావన్ (76) తో అపూర్వ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధావన్ వెను తిరిగాకా రహానే (1),పాండ్య (14) ధోని (10) సహకారం లేకపోయినా భువనేశ్వర్ తో కలిసి సఫారీలు వత్తిడికి గురయ్యే స్కోర్ అందించాడు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికా, చావల్ (4), కుల్దీప్ ధాటికి 179 పరుగులకే కుప్ప కూలింది. ఆ టీం లో ఆల్ రౌండర్ డుమిని బౌలింగ్ లో 2 వికెట్లు తీసి బ్యాటింగ్ లో అర్ధ సెంచరీ చేశాడు. మిగిలిన బ్యాట్స్ మెన్ అంతా టీం ఇండియా స్పిన్నర్ల ధాటికి కకావికలమై ఆలౌట్ అయ్యి పెవిలియన్ బాట పట్టింది. దాంతో 124 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది భారత్. మరో మూడు మ్యాచ్ లలో సిరీస్ గెలవాలంటే భారత్ కి ఒక్క మ్యాచ్ విక్టరీ సరిపోతుండగా సఫారీలు మాత్రం వన్డే సిరీస్ డ్రా చేయాలంటే మిగిలిన మ్యాచ్ లన్ని గెలవాలిసి వుంది.

Similar News