కోస్తా నుంచి జగన్ యాత్ర తీరు మారుతుందా ...?

Update: 2018-01-26 05:30 GMT

రాయలసీమ జిల్లాల్లో వైసిపి అధినేత జగన్ పాదయాత్ర సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ పార్టీ శ్రేణులు హుషారుగా వున్నాయి. టిడిపి లోకి తమ పార్టీ ఎమ్యెల్యేలు క్యూ కట్టి వెళ్లిపోవడంతో డీలా పడ్డ వైసిపి శ్రేణులు జగన్ ప్రజా సంకల్ప యాత్రకు అనూహ్య స్పందన ప్రజలనుంచి రావడంతో ఆనందంతో వున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ పాదయాత్ర ఫీడ్ బ్యాక్ పీకే టీం నుంచి తీసుకున్న జగన్ పార్టీ ముఖ్యులతో చర్చించి కోస్తా పాదయాత్రకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొన్ని మార్పులు చేసే అవకాశముంది.

సామాన్యులకు మరింత చేరువగా యాత్ర ...

అనవసర కార్యక్రమాలను కట్ చేసి ప్రజలతో మరింతగా మమేకం అయ్యేలా కోస్తా టూర్ సాగబోతోంది అంటున్నారు. అన్ని వర్గాలను కలుస్తూ వారి వారి సమస్యలు తెలుసుకునేలా యాత్ర డిజైన్ చేస్తారంటున్నారు. వాస్తవానికి రాయలసీమ జిల్లాల్లో వైసిపి కి మంచి పట్టు వుంది. దాంతో అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో సైతం వైసిపి గాలి గట్టిగానే గత ఎన్నికల్లో వీచింది. కానీ ఆ తరువాత పరిణామాల్లో పార్టీలోని ఎమ్యెల్యేలు జగన్ ను వీడి గోడదూకి టిడిపి లోకి వెళ్లిపోయారు. దాంతో కొంత ఈ రెండు జిల్లాల్లో వైసిపి వ్యవహారాలు అంత జోరుగా సాగడం లేదంటున్నారు.

గ్రూపు విభేదాలను....

దానికి తోడు జగన్ బంధువులు బాలినేని శ్రీనివాస్, సుబ్బారెడ్డి రెండు గ్రూప్ లుగా వ్యవహారాలు నడిపిస్తూ ఉండటం కూడా పార్టీకి మైనస్ గా పరిణమించాయని వైసిపి కార్యకర్తలు వాపోతున్నారు. వీరిద్దరి మధ్య కలహాల కారణంగా ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైంది. వాస్తవానికి ప్రకాశంలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. కాని జిల్లా నేతల్లో సమన్వయ లోపం పార్టీని ఇబ్బందుల పాల్జేస్తోంది. ఈ నేపథ్యంలో సింహపురి నుంచి కోస్తా వైపు దూసుకువస్తున్న తమనేత పాదయాత్ర తో అయినా పూర్వ వైభవం రావడంతో పాటు గ్రూప్ ల వివాదానికి అధినేత చెక్ పెడతారని క్యాడర్ ఆశగా ఎదురు చూస్తుంది. చూద్దాం జగన్ కోస్తా నుంచి జగన్ స్టయిల్ మారుస్తారేమో...!

Similar News