కోమటిరెడ్డి సంచలన నిర్ణయం...ఆమెకు లాభించేనా?

Update: 2018-02-07 10:30 GMT

ఈసారి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌తోపాటు సీఎం కేసీఆర్‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు టి-కాంగ్రెస్ నేత‌లు! ఇందుకు సంబంధించి ఏ చిన్న అవ‌కాశం దొరికినా అస్స‌లు వ‌దులుకునే ప‌రిస్థితుల్లో క‌నిపించడం లేదు. ఐక‌మ‌త్యంగా పోరాడాల‌ని భావిస్తున్న నేత‌లకు టీఆర్ఎస్‌పై ఇప్పుడు బ్ర‌హ్మాస్త్రం దొరికిన‌ట్ట‌యింది. ఇటీవ‌ల కాంగ్రెస్ నేత బొడ్డుప‌ల్లి శ్రీ‌నివాస్‌ను కొంద‌రు దుండ‌గులు హ‌త‌మార్చిన విష‌యం తెలిసిందే! దీని వెనుక టీఆర్ఎస్ నాయ‌కుల హ‌స్తం ఉన్న‌ట్లు కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇది టీఆర్ఎస్‌కు మింగుడు ప‌డటం లేదు. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. శ్రీ‌నివాస్ భార్య‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి న‌ల్గొండ బ‌రిలో దింపాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది!

బలంగా ఉన్న చోట....

తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌లంగా ఉన్న జిల్లా న‌ల్గొండ‌. ఆ పార్టీలోని కీల‌క నాయ‌కులంతా ఇక్క‌డి నుంచే గెలుపొందారు. అందుకే న‌ల్గొండ‌పై కేసీఆర్ దృష్టిసారించారు. కానీ ప్ర‌స్తుతం అధికార టీఆర్ఎస్‌కు మాత్రం ఇక్క‌డ ప‌ట్టు దొర‌క‌డం లేదు. ప్రస్తుతం బొడ్డుప‌ల్లి శ్రీ‌నివాస్ హ‌త్య‌.. టీఆర్ఎస్ నాయ‌క‌త్వానికి కొత్త చిక్కులు తీసుకొచ్చింది. ఇది ప్ర‌భుత్వ‌మే చేయించింద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఇందుకు త‌గిన‌ట్లుగానే కొన్ని ఆడియో టేపులు బ‌య‌ట‌ప‌డ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. త‌మ త‌గాదాలు ప‌క్క‌న‌ పెట్టి.. నాయ‌కులు ఏక‌తాటిపైకి చేరారు. టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున‌పెట్టే ప్ర‌య‌త్నాలు ముమ్మరం చేశారు.

ఆమెను నల్లగొండ అసెంబ్లీ బరి నుంచి...

ప్ర‌స్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సంచలన నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బొడ్డుపల్లి శ్రీనివాస్ సతీమణి, నల్గొండ మునిసిపల్ చైర్‌పర్సన్ లక్ష్మిని నల్గొండ నుంచి అసెంబ్లీ బరిలో దింపాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కోమటిరెడ్డిని నల్గొండ నుంచి లోక్‌సభ స్థానంలో బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు సమాచారం. లోక్‌సభకు పోటీ చేసేందుకు కోమటిరెడ్డి కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన చేయించాలని టీపీసీసీ భావిస్తోంది.

టీఆర్ఎస్ కు ఇబ్బందులేనా?

శ్రీనివాస్ హత్య వెనక టీఆర్ఎస్ ఉందనేది కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తోంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశమే ఈ హత్య చేయించాడని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. హత్యకేసు నిందితులు వీరేశంతో మాట్లాడినట్టు కాల్ డేటా బయటపడడం సంచలనం సృష్టించింది. ఇక హత్యకు గురైన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీని తీసుకురావాలని, అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలనేది తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ అది సాధ్యం కాకుంటే ఏఐసీసీ ముఖ్య నేతలతో అయినా ప్రకటన చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ప‌రిణామాలు టీఆర్ఎస్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టేలానే క‌నిపిస్తున్నాయి.

Similar News